యడియూరప్పకు బిగ్ షాక్

  • Published By: venkaiahnaidu ,Published On : June 8, 2020 / 04:17 PM IST
యడియూరప్పకు బిగ్ షాక్

కన్నడ సీఎం యడియూరప్పకు బీజేపీ హైకమాండ్ బిగ్ షాక్ ఇచ్చింది. యడియూరప్పతో పాటు కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నలిన్‌ కుమార్‌ కతీల్‌ ఎంపిక చేసిన ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం పక్కకుపెట్టేసింది. వారు సూచించిన రమేశ్‌ కట్టి, ప్రకాశ్‌ శెట్టి, ప్రభాకర్‌ కోరే పేర్లను పక్కకు పెట్టిన పార్టీ హైకమాండ్…ఊహించని విధంగా పార్టీలో అంతగా ప్రాచుర్యం లేని ఎర్రన్న భీమప్ప కడాది, అశోక్‌ జాస్తి పేర్లను ఖరారు చేసింది.

బీజేపీ రాష్ట్ర శాఖ సూచించిన వాళ్లల్లో ప్రకాశ్ శెట్టి వ్యాపారవేత్త కాగా,ప్రభాకార్ కోరే ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు,రమేష్ కట్టి సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే ఉమేష్ కట్టి సోదరుడు. అయితే ఊహించని విధంగా రెండు కొత్త ఫేస్ లను తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసి తాను ఆశ్చర్యపోయినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎస్‌ ప్రకాశ్‌ స్వయంగా అంగీకరించారు. అయితే కిందిస్థాయి నేతల సేవలకు గౌరవం దక్కిందన్నారు. మరోవైపు యెడియూరప్ప వారసుడి కోసం కూడా బీజేపీ అన్వేషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నెల 25వ తేదీతో కర్ణాటక నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు రాజీవ్‌ గౌడ, బీకే హరిప్రసాద్‌, ప్రభాకర్‌ కోరే, డీ కుపేంద్ర రెడ్డిల పదవీకాలం ముగియనున్నది. దాంతో నాలుగు సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 19న ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమీషన్‌ ప్రకటించింది. ఈ నెల ఒకటో తేదీన ప్రకటించిన నోటిఫికేషన్‌ ప్రకారం నామినేషన్ల దాఖలుకు గడువు రేపటితో ముగియనున్నది. బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించిన ఎర్రన్న కాదాడి బెలగావి వాసి కాగా, అశోక్‌ జాస్తి రాయ్‌చూర్‌కు చెందినవారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే నామినేషన్‌ దాఖలు చేయగా.. జేడీఎస్‌ తరఫున దేవేగౌడ రేపు తన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.