గాంధీజీకి సర్జరీ జరిగిన హాస్పిటల్ ఇదే!

  • Published By: veegamteam ,Published On : October 2, 2019 / 07:53 AM IST
గాంధీజీకి సర్జరీ జరిగిన హాస్పిటల్ ఇదే!

మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆయనకు ఘన నివాళులు అర్పిస్తోంది. గాంధీ గురించి ఆసక్తికర విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నెటిజన్లు . 95 ఏళ్ల క్రితం బాపూ జీవితంలో చోటు చేసుకున్న ఘటనను కూడా షేర్ చేశారు. అదేంటంటే.. గాంధీజీ అపెండిక్స్ వ్యాధితో బాధపడిన క్షణాలు. 

మహాత్మాగాంధీ  1924, జనవరి 12న పూణేలోని ఎరవాడా సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు ఆయన వయస్సు 50 ఏళ్లు. ఉన్నట్టుండి ఓ రోజు గాంధీకి పొత్తి కడుపులో నొప్పి రావడంతో ఆయన్ను చికిత్స కోసం పూణేలోని ససోన్ హాస్పిటల్‌ కు తరలించారు. వైద్యులు గాంధీజీని పరీక్షించి ఆయన అపెండిక్స్తో బాధపడుతున్నట్లు తెలిపారు. అప్పట్లో అపెండిక్స్ అంటే చాలా పెద్ద విషయం. అప్పటికే  భారీ వర్షం కురిసిందట.  అర్థత్రి సమయంలో ఓ చిన్న గదిలో లాంతరు వెలుగులోనే గాంధీజీకి సర్జరీ చేశారు వైద్యులు. దాదాపు 40 నిమిషాల పాటు సర్జరీ జరిగింది. 

గాంధీతో సర్జరీకి ముందు ఓ లేఖ రాయించుకున్నారు.  ఆపరేషన్ చేయించుకునేందుకు గాంధీజి అంగీకరించారంటూ.. ఇప్పటి వరకు డాక్టర్లు తనకు మంచి చికిత్స అందించారని అయితే పొరపాటున జరగరానిది ఏదైనా జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు దిగరాదని ప్రజలను కోరుతూ లేఖ రాయించారు. 

గాంధీకి ఆపరేషన్ జరిగిన గదిని ఓ మెమోరియల్‌గా మార్చింది ప్రభుత్వం. అయితే ఇది అన్ని రోజులు తెరిచి ఉండదు. కొన్ని ప్రత్యేక రోజుల మాత్రమే దీన్ని ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఈ గదిని తెరిచింది ససోన్ హాస్పిటల్. ఇక గాంధీ సర్జరీకి వినియోగించిన కత్తెర్లు ఇతరత్ర పరికరాలు ఆ గదిలో ఇప్పటికీ అలానే ఉన్నాయి. అంతేకాదు అందులో ఓ లాంతరు కింద జరిగిన సర్జరీ ఘట్టాన్ని తెలుపుతూ ఉన్న ఓ పెయింటింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.