విఘ్న నాయకుడికి తప్పని కష్టాలు: కరోనాతో కొట్టుకుపోతున్న ఏడాదికి సరిపడ సంపాదన

విఘ్న నాయకుడికి తప్పని కష్టాలు: కరోనాతో కొట్టుకుపోతున్న ఏడాదికి సరిపడ సంపాదన

ఇళ్లల్లో చిన్న చిన్నవి.. అపార్ట్‌మెంట్‌లు, వీధుల్లో భారీ వినాయక విగ్రహాలను నిలిపేవాళ్లు. విగ్రహాల తయారీదారులు పండక్కి నెలల ముందు నుంచే వేర్వేరు ఆకృతుల్లో, ఆకర్షణీయంగా ట్రెండీ గణపయ్యలను సిద్దమయ్యేవారు. గిట్టుబాటు ఉండడంతో భారీ పెట్టుబడులతో తయారీ ఉండేది. అంతలోనే సీన్ రివర్స్ అయింది. కరోనా ఎంట్రీతో పండుగలన్నీ ఇళ్లకే పరిమితం అయ్యాయి. వైరస్‌ ఎఫెక్ట్‌, లాక్‌డౌన్‌ ఎక్కువ రోజులు ఉంటుందని ఊహించని తయారీదారులు బొమ్మల తయారీకి అవసరమైన సరంజామాకు లక్షలు వెచ్చించారు.

కొందరైతే విగ్రహాల తయారీ కోసం అవసరమైన ప్లాస్టరాఫ్‌ ప్యారీస్‌, రంగులు, చెక్కలు, కర్రలు, ఇనుప చువ్వలు లాంటి సామగ్రిని ముందస్తుగానే సిద్ధం చేసుకున్నారు. మార్చి మొదటివారం నుంచే విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టారు. గత నెలాఖరు వరకూ విగ్రహాలు తయారీలోనే నిమగ్నమయ్యారు. కొంతమంది 5 లక్షల నుంచి 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. విగ్రహాలు తయారు చేసి సిద్ధంగా ఉంచుకున్నారు.

పరిస్థితులు చక్కదిద్దుకుంటాయని భావించి విగ్రహాలు కూడా తయారు చేసేశారు. తీరా ఇప్పుడు చూస్తే విగ్రహాలు అమ్ముడుపోకపోవడంతో వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. కొంత మంది విగ్రహాలను టెంట్లలోనే వదిలేసి సొంతూళ్లకి వెళ్లిపోయారు. సాధారణ రోజుల్లో అయితే జూలై మొదటి వారం నుంచే భారీ విగ్రహాలు కావాల్సినవారు తయారీదారుల్ని సంప్రదించేవారు. అడ్వాన్సులు ఇచ్చివెళ్లేవాళ్లు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో వీరి వైపు చూసే నాథుడే కరువయ్యాడు.

vinayaka chavithi : Ganesha Celerbrations Around the World

ఈ సీజన్‌లో లాభాలతో ఏడాదికాలం బతుకుబండి
హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే వందల మంది విగ్రహాల తయారీదారులు ఉన్నారు. వీళ్ల దగ్గర వేల సంఖ్యలో కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు వాళ్లందరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అప్పులు కుప్పలైపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. చాలా కుటుంబాలు విగ్రహాల తయారీపైనే జీవనం కొనసాగిస్తున్నాయి. ఈ సీజన్‌లో వచ్చే లాభంతోనే ఏడాదంతా గడిపేస్తుంటాయి. పిల్లల చదువులు కూడా ఈ వృత్తి మీదే ఆధారపడి ఉంటాయి. కరోనా ప్రభావంతో వ్యాపారం గిట్టుబాటు కావడం లేదు. విగ్రహాలను కొనేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇక అప్పులు తీరెదెలా అని నిట్టూరుస్తున్నారు.

పండుగలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరోనా
వైరస్ మిగిల్చే కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా కరోనా ప్రభావానికి చితికిపోతున్నారు. ఇప్పటికే అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఇప్పుడు పండుగలపైనా ప్రతాపం చూపిస్తోంది. సాధారణంగా ఆగస్ట్‌లో పండుగలు, ఈవెంట్లు ఉంటాయి. సంతోషాలకు మారుపేరుగా నిలిచే పంద్రాగస్టు, శ్రీ కృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, పీర్లపండుగ మొహరం గ్రాండ్‌గా జరుపుకుంటారు. కానీ ఈ పండుగలన్నీంటిపై కరోనా పంజా విసిరింది. మహమ్మారి భయంతో పండుగ కన్న ప్రాణం ఉంటే చాలన్నట్టుగా తయారైంది పరిస్థితి.

combodia

కరోనా కారణంగా ఒక్క విగ్రహాల తయారీదారులే కాదు.. మండపాలకు సెట్టింగ్‌ వేసేవాళ్లు, బ్యాండ్‌మేళం, ట్రాలీలు, లారీలకు డిమాండ్‌ తగ్గింది. కనిపించని సూక్ష్మజీవి వీళ్లందరి జీవితాలను ఆగం చేసింది. కరోనా కట్టడి కోసం విగ్రహాల ప్రతిష్టలపై నిషేధాజ్ఞలు విధించడంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విగ్రహాల తయారీదారులు కోరుతున్నారు. తలకు మించిన అప్పుల భారం నుంచి గట్టెక్కించాలని వేడుకుంటున్నారు. మాయదారి కరోనా వచ్చింది.. సందడి మాయమైంది. ఏ వీధిలో చూసినా మండపాలు కనిపించడం లేదు. నవరాత్రి వేడుకలకి జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. వినాయక చవితి తర్వాత అయినా కరోనా విఘ్నాలు తొలగిపోవాలని ప్రజలంతా ఆశిస్తున్నారు.