యూపీలో మరో దారుణం : డాల్ఫిన్ ను అత్యంత కిరాతకంగా చంపేసిన యువకులు

యూపీలో మరో దారుణం : డాల్ఫిన్ ను అత్యంత కిరాతకంగా చంపేసిన యువకులు

Gigantic Dolphin Beaten : ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. మానవత్వం మరిచిపోతున్నారు. డాల్ఫిన్ అనే మూగ జీవాన్ని అత్యంత దారుణంగా చంపేశారు. జాతీయ జల జంతువు అయిన..డాల్ఫిన్ ను కర్రలు, గొడ్డలి, రాడ్లతో కొట్టి దారుణంగా హింసించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు…ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే…

ప్రతాప్ గడ్ జిల్లాలో కొఠారియా గ్రామ సమీపంలో శారదా కెనాల్ లో కొంతమంది యువకులు చేపల వేటకు వెళ్లారు. యువకుల వలకు ఏదో చిక్కింది. పెద్ద చేపగా భావించి వారు..బయటకు లాగారు. కానీ వలలో పడింది డాల్ఫిన్ అని తెలియడంతో వారు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఆ అక్కసు అంతా..దానిపై చూపెట్టారు. అతి దారుణంగా..గొడ్డలి, కర్రలు, రాడ్లతో చితకబాదారు. అది విలవిలలాడుతున్నా..కనికరం లేకుండా..కొట్టారు. కత్తులతో దానిని రెండుగా చీల్చి అక్కడే పడేసి వెళ్లిపోయారు.

ఈ మొత్తం ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియోలో పోస్టు చేశాడు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టి.. సమీప గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 2009లో ప్రభుత్వం డాల్ఫిన్ ను జాతీయ జంతువుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. డాల్ఫిన్ చంపడం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్టు 1972 సెక్షన్ 9/51 ప్రకారం నేరం.