Gautam Adani: సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గౌతమ్ అదానీ
గత మూడు రోజులుగా అదానీ గ్రూప్ షేర్లు అనూహ్యంగా పుంజుకుంటున్నాయి. గురువారంసైతం అదానీ షేర్ల జోరు కొనసాగింది. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ విల్మార్, అదానీ ట్రాన్స్ మిషన్‌లు అప్పర్ సర్క్యూట్‌ను పొందాయి.

Adani Group
Gautam Adani: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ – హిండెన్ బర్గ్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా వివాదాస్పదమవుతున్న ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. ఈ అంశంపై విచారణకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. రిటైర్డ్ జడ్జి అభయ్ మనోహార్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఓపీ భట్, జేపీ దేవ్‌ధర్, కేవీ కామత్, నందన్ నీలేకని, న్యాయవాది సోమశేఖర్ సుందరేశన్ ఉంటారు.
Gautam Adani Group: హిండెన్‌బర్గ్ దెబ్బకు.. గ్రాంట్ థోర్న్‌టన్‌ను నియమించుకున్న అదానీ గ్రూప్
హిండెన్‌బర్గ్ నివేదిక, అదానీ షేర్ల వ్యవహారంపై ఈ కమిటీ విచారణ చేపడుతుంది. రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కోర్టు సూచించింది. సీల్డ్ కవర్‌లో నివేదికను సుప్రీంకోర్టులో సమర్పించాలని కమిటీని ఆదేశించింది. అలాగే ఈ అంశంలో ఇప్పటివరకు జరిగిన విచారణపై స్టేటస్ రిపోర్ట్ అందించాలని సెబీని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. హిండెన్‌బర్గ్ – అదానీ వ్యవహారంలోని అంశాలకు సంబంధించిన నిజాలపై శోధనతోపాటు, పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగేలా, లోపాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాల్ని కమిటీ పరిశీలిస్తుంది.
The Adani Group welcomes the order of the Hon'ble Supreme Court. It will bring finality in a time bound manner. Truth will prevail.
— Gautam Adani (@gautam_adani) March 2, 2023
ఇదిలాఉంటే సుప్రీంకోర్టు నిర్ణయంపై గౌతమ్ అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ వేదికగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. గడువులోగా కమిటీ కోర్టుకు నివేదిక ఇస్తుందని ఆశిస్తున్నానని, అసలు నిజం బయటపడుతుందని అదానీ అన్నారు. ఇదిలాఉంటే జనవరి 24న అమెరికన్ రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక తరువాత అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోయిన విషయం విధితమే. నెలరోజులుగా అదానీ గ్రూప్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగాయి. ప్రపంచ కుబేరులో జాబితాలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న అదానీ ఒక్కసారిగా 30వ స్థానంకు పడిపోయాడు. అయితే, గత మూడు రోజులుగా అదానీ గ్రూప్ షేర్లు అనూహ్యంగా పుంజుకుంటున్నాయి. గురువారంసైతం అదానీ షేర్ల జోరు కొనసాగింది. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ విల్మార్, అదానీ ట్రాన్స్ మిషన్‌లు అప్పర్ సర్క్యూట్‌ను పొందాయి.