ఇంకా ఫాస్టాగ్‌ కొనుగోలు చేయని వాహనదారులకు శుభవార్త

ఇంకా ఫాస్టాగ్‌ కొనుగోలు చేయని వాహనదారులకు శుభవార్త

get fastag free at toll plazas: కేంద్ర ప్రభుత్వం ఫోర్ వీలర్స్ కు ‘ఫాస్టాగ్‌’ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. టోల్ ప్లాజాల దగ్గర పూర్తిస్థాయిలో నగదు రహితంగా కార్యకలాపాలు చేపట్టారు. ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపైనా పూర్తిస్థాయిలో నగదు రహితంగా టోల్‌ వసూలు చేస్తున్నారు. గత రెండు రోజుల్లో రికార్డ్ స్థాయిలో 2.5 లక్షల మంది కొత్తగా ఫాస్టాగ్‌ సదుపాయాన్ని పొందారని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. తొలి రెండు రోజుల్లో 87శాతం వాహనాలు టోల్‌ప్లాజాల దగ్గర ఫాస్టాగ్‌ ద్వారా చెల్లింపులు జరిపాయని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. 17వ తేదీ ఒక్కరోజే దేశ వ్యాప్తంగా సుమారు 60 లక్షల వ్యవహారాల్లో రూ.95 కోట్ల మేర టోల్‌ వసూలైందని తెలిపింది.

కాగా, ఇంకా ఫాస్టాగ్‌ కొనుగోలు చేయని వాహనదారులకు శుభవార్త. ఫాస్టాగ్‌లను ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఫాస్టాగ్‌ ధర రూ.100గా ఉంది. మార్చి 1వ తేదీ వరకు 770 టోల్‌ప్లాజాల దగ్గర బ్యాంకులు ఉచితంగా ఫాస్టాగ్‌ను అందజేస్తాయి. బ్యాలెన్స్‌ రీచార్జి చేసుకుంటే సరిపోతుంది. ఫాస్టాగ్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రవాణా శాఖ తెలిపింది.

మైఫాస్టాగ్‌ యాప్‌లో పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. వాహనం నంబరును నమోదు చేయగానే నగదు నిల్వల వివరాలు తెలుసుకోవచ్చని వివరించింది. నగదు నిల్వలు ఆకుపచ్చ, కాషాయం, ఎరుపు రంగుల్లో ఉంటాయని తెలిపింది. ఆకుపచ్చ రంగు ఉంటే తగినన్ని నిల్వలు ఉన్నాయని, కాషాయం రంగు ఉంటే నిల్వలు తక్కువగా ఉన్నాయని, ఎరుపు రంగులో ఉంటే బ్లాక్‌లిస్టులో ఉన్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది. ఫాస్టాగ్‌ ఆఫ్‌లైన్‌ రీచార్జ్‌ కోసం టోల్‌ప్లాజాల దగ్గర 40వేల పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌(పీవోఎస్‌) యంత్రాలను అందుబాటులో పెట్టినట్లు వెల్లడించింది.

టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు అధిక సమయం వేచి చూసే అవసరం లేకుండా అంటే టైమ్ వేస్ట్ కాకుండా, అలాగే భారీ రద్దీని తొలగిచేందుకు, సులభతర చెల్లింపుల కోసం తీసుకొచ్చిన విధానమే ఫాస్టాగ్. బార్ కోడ్ తరహాలోని ఓ ఎలక్ట్రానిక్ స్టిక్కర్ నే ఫాస్టాగ్ అంటారు. ఫాస్టాగ్ విధానాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనాలకు టోల్ ప్లాజాల దగ్గర రెట్టింపు ఫీజు వసూలు చేస్తారు. అంతేకాదు ఫైన్ కూడా వేస్తారు. ఫాస్టాగ్ లేకపోవడం అంటే మోటార్ వాహన చట్టం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. దీనికి తొలిసారి రూ.300, రెండోసారి రూ.500 ఫైన్ పడుతుందని వివరించారు.

సోమవారం(ఫిబ్రవరి 15,2021) అర్థరాత్రి నుంచి పూర్తిస్థాయిలో ఫాస్టాగ్ నిబంధన అమల్లోకి వచ్చింది. టోల్ గేట్ల దగ్గర నగదు చెల్లింపులు ఉండవు. ఫాస్టాగ్ లేని వారికి ప్రత్యేక లేన్లు ఏమీ ఉండవు.