ముస్లింలను అప్పుడే పాకిస్తాన్ పంపించి ఉండాల్సింది

అప్పుడే ముస్లింలను పాకిస్తాన్‌కు పంపించి, అక్కడి హిందువులను ఇక్కడికి తీసుకొచ్చి ఉంటే.. ఇప్పుడీ ఇబ్బందులు పడే వాళ్లమే కాదు. సీఏఏ అవసరం వచ్చేదే కాదు

  • Published By: veegamteam ,Published On : February 22, 2020 / 06:28 AM IST
ముస్లింలను అప్పుడే పాకిస్తాన్ పంపించి ఉండాల్సింది

అప్పుడే ముస్లింలను పాకిస్తాన్‌కు పంపించి, అక్కడి హిందువులను ఇక్కడికి తీసుకొచ్చి ఉంటే.. ఇప్పుడీ ఇబ్బందులు పడే వాళ్లమే కాదు. సీఏఏ అవసరం వచ్చేదే కాదు

కేంద్ర పశు సంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ను సమర్థిస్తూ ముస్లింలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. 1947 లోనే ముస్లింలందరిని పాకిస్తాన్‌కు పంపించి ఉండాల్సిందని గిరిరాజ్ సింగ్ అన్నారు. అలా చేసుంటే ఇప్పుడీ సమస్య ఉండేది కాదన్నారు. ‘‘బ్రిటిషర్స్ నుంచి విముక్తి కోసం మన పూర్వీకులు పోరాడితే.. ప్రత్యేక ఇస్లాం దేశం కోసం జిన్నా పని చేశాడు. 1947కు పూర్వమే జిన్నా ఒత్తిడి తెచ్చాడు. దానికి మన పూర్వీకులు ఒప్పుకున్నారు. ఇప్పుడు మనం భారీ మూల్యం చెల్లిస్తున్నాం. అప్పుడే కనుక ముస్లింలను పాకిస్తాన్‌కు పంపించి, అక్కడి హిందువులను ఇక్కడికి తీసుకొచ్చి ఉంటే.. ఇప్పుడీ ఇబ్బందులు పడే వాళ్లమే కాదు. సీఏఏ అవసరం వచ్చేదే కాదు. భరత వంశీయులకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వకపోతే, ఇంకెక్కడిస్తారు, వారెక్కడికి వెళ్తారు?’’ అని గిరిరాజ్ సింగ్ అన్నారు.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్గనిస్తాన్ దేశాల్లో మత పరంగా ఇబ్బందులు పడుతూ శరణార్థులుగా భారత్ వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో కేంద్రం సీఏఏను తీసుకొచ్చింది. దీనిపై విపక్షాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. 

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు, చర్చలు జరుగుతున్నాయి. ఒక మతం ఆధారంగా సీఏఏ తీసుకొచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం అని ముస్లిం సంఘాలు అంటున్నాయి. ముస్లింలకు అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. సీఏఏకు అనుకూలంగా బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో గిరిరాజ్ సింగ్ ఈ కామెంట్స్ చేశారు. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. నోటికొచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదన్నాయి. మతం ఆధారంగా దేశాన్ని విభజించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డాయి. బీజేపీ మాత్రం.. సీఏఏని సమర్థిస్తోంది. విపక్షాల ఆరోపణలను ఖండించింది. సీఏఏ కారణంగా ఏ మతం వారికి అన్యాయం జరగదని బీజేపీ నేతలు చెబుతున్నారు. సీఏఏపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సభలు నిర్వహిస్తున్నారు.