దారుణం.. దుస్తులు విప్పించి బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

దారుణం.. దుస్తులు విప్పించి బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

Girls stripped, forced to dance by police: మహారాష్ట్రలో దారుణం జరిగింది. రక్షించాల్సిన ఖాకీలే కీచకులుగా మారారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేశారు. కేసు విచారణ పేరుతో పోలీసులు వికృత చర్యలకు పాల్పడ్డారు. ఓ బాలికల హాస్టల్‌లోకి ప్రవేశించి, బలవంతంగా వారి దుస్తులు విప్పించి, నగ్నంగా డ్యాన్స్ చేయించారు.

జల్‌గావ్‌లో బాలికల హాస్టల్ ఉంది. ఈ హాస్టల్‌ను మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. కొద్దిరోజుల క్రితం కొందరు బయటి వ్యక్తులు, పోలీసులు, అధికారులు హాస్టల్‌కి వెళ్లారు. కేసు విచారణ పేరుతో వారు హాస్టల్ కి వచ్చారు. లోనికి వెళ్లాక పోలీసులు రెచ్చిపోయారు. అక్కడున్న బాలికలను బెదిరించారు. వారితో బలవంతంగా బట్టలు విప్పించి.. నగ్నంగా డ్యాన్స్‌ చేయించి పైశాచిక ఆనందం పొందారు. దీనికి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ దారుణం గురించి ఓ ఎన్జీఓకు తెలియడంతో వారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే శ్వేతా మహాలే దీని గురించి అసెంబ్లీలో ప్రస్తావించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

ఈ దారుణంలో పోలీసులు కూడా పాలు పంచుకున్నారని తెలిసి సిగ్గుపడుతున్నామని శ్వేతా మహాలే అన్నారు. ఇలాంటి పనులతో రాష్ట్రం పరువు పోతుందన్నారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే రాక్షసులుగా మారుతున్నారని వాపోయారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ ఘటన దుమారం రేపడంతో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కోసం నలుగురు సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ మేరకు అసెంబ్లీలో హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ప్రకటించారు. ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన అని, దీనికి బాధ్యులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నలుగురు అధికారులతో అత్యున్నత కమిటీ ఏర్పాటు చేశామని, రెండు రోజుల్లో నివేదికను అందజేయాలని కోరినట్టు హోంమంత్రి తెలిపారు. నివేదిక ఆధారంగా నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.