Give A Bed Or Kill : బెడ్ ఇవ్వండి లేదా చంపేయండి.. కరోనా సోకిన తండ్రికి చికిత్స అందక కొడుకు ఆవేదన, 2రాష్ట్రాలు తిరిగినా దొరకని బెడ్

తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో గుండెలను తాకుతోంది. కరోనా బారిన పడ్డ ఓ తండ్రి అవస్థ చూసి తట్టుకోలేకపోయిన కుమారుడు చేసిన అభ్యర్థన అందరిని కంటతడి పెట్టిస్తోంది. ఆసుపత్రిలో బెడ్ అన్నా ఇవ్వండి లేదా ఇంజక్షన్ ఇచ్చి మా నాన్నను చంపేయండి.. అంటూ కొడుకు చేసిన అభ్యర్థన అందరిని ఆవేదనకు గురి చేసింది.

Give A Bed Or Kill : బెడ్ ఇవ్వండి లేదా చంపేయండి.. కరోనా సోకిన తండ్రికి చికిత్స అందక కొడుకు ఆవేదన, 2రాష్ట్రాలు తిరిగినా దొరకని బెడ్

Give A Bed Or Kill My Father

Give A Bed Or Kill My Father : దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత భయానకంగా ఉంది. సెకండ్ వేవ్ లో మహమ్మారి మరింతగా రెచ్చిపోయింది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రెండో దశలో కరోనా ఉధృతి రోగుల పరిస్థితిని దయనీయంగా మార్చేసింది. ఆసుపత్రుల్లో తగిన సమయంలో వైద్యం అందించలేకపోతున్నామనే బాధ రోగుల కుటుంబ సభ్యులను వేధిస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో గుండెలను తాకుతోంది. కరోనా బారిన పడ్డ ఓ తండ్రి అవస్థ చూసి తట్టుకోలేకపోయిన కుమారుడు చేసిన అభ్యర్థన అందరిని కంటతడి పెట్టిస్తోంది. ఆసుపత్రిలో బెడ్ అన్నా ఇవ్వండి లేదా ఇంజక్షన్ ఇచ్చి మా నాన్నను చంపేయండి.. అంటూ కొడుకు చేసిన అభ్యర్థన అందరిని ఆవేదనకు గురి చేసింది.

మహారాష్ట్రలోని చంద్రాపూర్(ముంబైకి 850కిమీ దూరం) ప్రాంతానికి చెందిన సాగర్ కిశోర్ అనే వ్యక్తి తండ్రికి కొవిడ్ సోకింది. లక్షణాలు తీవ్రంగా ఉండటంతో అంబులెన్సులో ఆసుపత్రికి తరలించాడు. అయితే తన తండ్రిలాగే చాలామంది చంద్రాపూర్‌లో ఆసుపత్రి బయట బారులుతీరి ఉన్నారని అక్కడికి వచ్చాకే సాగర్‌కు తెలిసింది. మరోవైపు, కొవిడ్ బాధితులంతా ఆసుపత్రులకు రావడంతో అక్కడి వైద్యశాలలను 24 గంటలపాటు మూసివేశారు. మరోవైపు అంబులెన్సులో ఉన్న సాగర్ తండ్రి దగ్గుతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.

సాగర్ తన తండ్రిని తీసుకుని మొదట వరోరా ఆసుపత్రికి వెళ్లాడు. తర్వాత చంద్రాపూర్‌లోని మరో వైద్యశాలకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు కూడా పరుగులు తీశాడు. ఎక్కడా బెడ్స్ అందుబాటులో లేవు. తండ్రి బాధను చూసి తట్టుకోలేకపోయిన సాగర్… పక్కనే ఉన్న తెలంగాణలోని ఆసుపత్రిలో చేర్పించాలనుకున్నాడు. కానీ, తెలంగాణకు వచ్చినా అదే పరిస్థితి ఎదురుకావడంతో మళ్లీ సొంత రాష్ట్రానికే వెళ్లాడు.

ఒకవైపు దగ్గు, మరోవైపు అంబులెన్సులో ఆక్సిజన్‌ అయిపోయే పరిస్థితి.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తండ్రిని చూసి తీవ్ర కలతకు గురయ్యాడు సాగర్. 24 గంటల్లో రెండు రాష్ట్రాలు తిరిగినా.. అతడికి వైద్యం దక్కలేదు. దాంతో సాగర్ విసిగిపోయాడు. తండ్రి పడుతున్న బాధ చూడలేక షాకింగ్ అభ్యర్థన చేశాడు.
‘నా తండ్రిని ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స అయినా అందించండి లేదా ఇంజెక్షన్ ఇచ్చి ఆయన్ను చంపేయండి. ఇలా నా తండ్రిని మాత్రం ఇంటికి తీసుకెళ్లలేను’ అంటూ సాగర్ అభ్యర్థించాడు. సాగర్ చేసిన అభ్యర్థన అందరిని షాక్ కి గురి చేసింది. అతడి ఆవేదన చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

2లక్షలకు పైగా కొత్త కేసులు, వెయ్యికి పైగా మరణాలు:
కాగా, భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. భారీగా ప్రాణాలను హరిస్తోంది. బుధవారం(ఏప్రిల్ 14,2021) రెండు లక్షలకు పైగా కేసులు, వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. ఈ మేరకు గురువారం(ఏప్రిల్ 15,2021) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 2,00,739 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,038 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564 కి చేరగా.. 1,73,123 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. రోజువారి కేసుల సంఖ్య దాదాపు 10 రోజుల్లో రెట్టింపు అయ్యాయి. దేశంలో ప్రస్తుతం 14,71,877 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. యాక్టివ్ కేసుల రేటు పది శాతానికి చేరువై కలవరపెడుతోంది. నిన్న ఒక్కరోజే 93,528 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య కోటీ 24 లక్షలను దాటేసింది.

మహారాష్ట్రలో అల్లకల్లోలం:
దేశం అంతా ఒక్క లెక్క అయితే మహారాష్ట్ర మాత్రం మరో లెక్క అన్నట్టుగా పరిస్థితి ఉంది. దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర.
మహారాష్ట్రను కరోనా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. బెడ్లు అందుబాటులో లేక, వెంటిలేటర్లు, ఆక్సిజన్, మందులు అందిచలేక ఆ రాష్ట్రం అవస్థలు పడుతోంది. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు అక్కడి ప్రభుత్వం కేంద్రం, సైన్యం సాయాన్ని కూడా అభ్యర్థించింది.

శవాల గుట్టలు, స్మశానాలు ఫుల్.. రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు..
మహారాష్ట్రలో కొద్దిరోజులుగా 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 58వేల 952 మందికి కరోనా సోకగా.. 278 మంది మరణించారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, ఢిల్లీని కొవిడ్ మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గుట్టలుగా శవాలు పేరుకుపోతున్నాయని, శ్మశానవాటికల్లో జాగా ఖాళీలేదనే వార్తలు కలచిచేస్తున్నాయి. అధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తర్‌ ప్రదేశ్ కూడా ఇప్పుడు మహారాష్ట్రకు తోడైనట్లు కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 20వేల 439 కొత్త కేసులు బయటపడ్డాయి. ఢిల్లీ పరిస్థితి అలాగే ఉంది. అక్కడ 17,282 మందికి కరోనా సోకింది. మహారాష్ట్ర(278), చత్తీస్‌గఢ్‌(120), ఢిల్లీ(104) మరణాలు సంభవించాయి. ప్రభుత్వం తెలుపుతున్న మృతుల సంఖ్యకు, వాస్తవ పరిస్థితులకు చాలా అంతరం ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.