గెలిచి తీరుతాం : గోవాలో నేడు బలపరీక్ష 

  • Published By: chvmurthy ,Published On : March 20, 2019 / 02:47 AM IST
గెలిచి తీరుతాం : గోవాలో నేడు బలపరీక్ష 

పనాజీ: గోవా శాసనసభలో బీజేపీ  నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం బుధవారంనాడు  బల పరీక్షను ఎదుర్కోనుంది. కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన  ప్రమోద్‌ సావంత్ తన బలాన్ని నిరూపించుకోనున్నారు. బలనిరూపణ కోసం బుధవారం ఉదయం 11-30 గంటలకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్ మృదులాసిన్హా తెలిపారు. విశ్వాసపరీక్షలో తామే నెగ్గుతామని సీఎం సావంత్‌ ధీమా వ్యక్తం చేశారు.

మనోహర్ పారికర్ అకాల మరణం తరువాత.. సోమవారం అర్ధరాత్రి రెండు గంటలకు సావంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కూటమిలో ఉన్న ఎంజీపీకి చెందిన సుదిన్‌ ధవిలికర్‌, జీఎఫ్‌పీకి చెందిన విజయ్‌ సర్దేశాయ్‌కు ఉపముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారు.  గోవాలో అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలుండగా కాంగ్రెస్‌కు 14, బీజేపీకి 12, మహారాష్ట్రవాది గోమాంతక్ పార్టీకి 3,  గోవా ఫార్వర్డ్ పార్టీకి 3,  ఎన్సీపీకి ఒక సభ్యుడు ఉన్నారు. వీరితో పాటు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు  ఇస్తున్నారు. మాజీ సీఎం మనోహర్ పారికర్ మృతి, బీజేపీకి చెందిన ఒకరు, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు ఎమ్మెల్యేలుగా రాజీనామా చేయడంతో నాలుగు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో 19 మంది సభ్యుల మద్దతు లభిస్తే ప్రమోద్ సావంత్ ప్రభుత్వం బయటపడుతుంది.