ఆడియో క్లిప్ కలకలం : గోవా మంత్రికి బీజేపీ నేతల బెదిరింపులు

  • Published By: venkaiahnaidu ,Published On : January 9, 2019 / 06:14 AM IST
ఆడియో క్లిప్ కలకలం : గోవా మంత్రికి బీజేపీ నేతల బెదిరింపులు

గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రానే ను బీజేపీ అగ్ర నాయకులు చంపేస్తామని భయపెడుతున్నారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ చెల్ల కుమార్ అన్నారు. రాఫెల్ డీల్ కి సంబంధించిన ఫైల్స్ సీఎం పారికర్ బెడ్రూమ్ లో ఉన్నాయంటూ విశ్వజిత్ మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

 ఈ సమయంలో మంగళవారం(జనవరి-8,2019) గోవా రాజధాని పనాజీలో కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న చెల్ల కుమార్ మాట్లాడుతూ…2017లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరే ముందు రోజు విశ్వజిత్ తనను కలిశాడని తెలిపారు. నన్ను, నా కుటుంబాన్ని బీజేపీ అగ్రనేతలు భయపెడుతున్నారని, అందుకే బీజేపీలో కొనసాగుతున్నట్లు విశ్వజిత్ తనకు చెప్పాడని కుమార్ తెలిపారు. ఫ్యామిలీని కాపాడుకోవటం కోసమే కాంగ్రెస్ ను విడిచి విశ్వజిత్  బీజేపీకి వెళ్లినట్లు తెలిపారు. విశ్వజిత్ ఏడాదికొకసారి రెగ్యులర్ గా తనకు ఫోన్ చేస్తాడని, తానేమీ అబద్దాలు చెప్పడం లేదని, అవసరమైతే ఏ టెస్ట్ కైనా తాను సిద్దమేనని కుమార్ తెలిపారు. ఆడియో క్లిప్ విషయంలో ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విశ్వజిత్ ను చంపేస్తామని భయపెడుతున్నారని కుమార్ అన్నారు.

అయితే కుమార్ అన్నీ అబద్దాలే మాట్లాడుతున్నారని మంత్రి విశ్వజిత్ రానే తెలిపారు. బీజేపీ లో చేరమని ఎవరూ భయపెట్టలేదని తెలిపారు. పార్టీలో చేరమని భయపెట్టే కల్చర్ కాంగ్రెస్ దని విశ్వజిత్ తెలిపారు.
అయితే ఆడియో క్లిప్ విషయంలో సీఎం పారికర్ ను బీజేపీ అగ్రనేతలు భయపెడుతున్నారని, సీఎంకు భద్రత మరింత పెంచాలంటూ కొన్నిరోజుల క్రితం గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్రపతికి ఓ లేఖ కూడా అందించింది.