ఈ ఏడాది 30% పెరిగిన బంగారం రేట్లు…ధరలను ప్రభావితం చేసే ముఖ్య అంశాలు

  • Published By: venkaiahnaidu ,Published On : July 24, 2020 / 07:10 PM IST
ఈ ఏడాది 30% పెరిగిన బంగారం రేట్లు…ధరలను ప్రభావితం చేసే ముఖ్య అంశాలు

బంగారం…ధరల్లో కొత్త కొత్త రికార్డులను తిరగరాస్తోంది. కొంతకాలంగా తగ్గినట్లే కనిపిస్తూ వచ్చి.. ఇప్పుడు డబుల్ స్పీడ్​తో దూసుకెళుతోంది. భారతదేశంలో ఈ ఏడాది బంగారం రేట్లు 30% పెరిగాయి. ఎంసీఎక్స్‌లో మొదటిసారి 10 గ్రాముల పసిడి ధర రూ.50,000 మార్క్ దాటింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం పెరిగి రూ.50,010 పలికింది. ఫ్యూచర్ మార్కెట్లో బంగారం రూ.50,000 మార్క్ చేరుకోవడం భారత పసిడి చరిత్రలో తొలిసారి

పెరుగుతున్న కరోనావైరస్ కేసులు, అమెరికా -చైనా ఉద్రిక్తతలు, తాజా ఉద్దీపన ఆశలు మరియు బలహీనమైన డాలర్.. ఇవన్నీ బంగారం పెరిగేందుకు దోహదపడ్డాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు,బంగారం ధర బాటనే వెండి కూడా ఫాలో అవుతోంది. రెండు, మూడు రోజుల్లోనే 2 వేలకు పైగా వెండి ధర పెరిగింది.

అసలు బంగారం ధర పెరగడానికి కారణాలివే..
పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణం. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర పరుగుల పెడుతుందని బులియన్ మార్కెట్ అంటోంది. ఇప్పటికే అమెరికా ఫెడ్ ప్యాకేజీ వల్ల డాలర్ వ్యాల్యూ పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు. మదుపరులు పుత్తడిపై పెట్టుబడులకు ఆసక్తి చూపడం, ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ ట్రెండింగ్, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు చైనాలో ఉన్న బంగార నిల్వల కంటే ఎక్కువ చేసి చూపించారన్న వార్తలు కూడా ఆసక్తికరంగా మారాయి.

భారత్ లో ముఖ్యమైన ఫ్యాక్టర్స్
శ్రావణమాసం వచ్చేసింది. ఫెస్టివ్ సీజన్ ముందుంది. ఇప్పుడిప్పడే పెళ్లిళ్లు, శుభకార్యాలు మళ్లీ జోరందుకుంటున్నాయి. దీంతో సహజంగానే అమ్మకాలు పెరుగుతున్నాయి. దీనికితోడు పెరుగుతున్న ధరలనేపథ్యంలో బంగారం కొని పెట్టుకోవడం మంచిదన్న సెంటిమెంట్ ఇప్పుడు బలంగా ఉంది.

హై డిమాండ్ .. లో ఇంపోర్ట్స్
ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. చైనా తర్వాత మనమే. కానీ మన దగ్గర వినియోగానికి తగినంత బంగారం నిల్వలు లేవు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కరోనా వైరస్ ఆంక్షల నడుమ దిగుమతులు ప్రభావితం అవుతున్నాయి. ఇది గోల్డ్ ట్రేడర్లు వరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో బంగారం దిగుమతులు భారీగా తగ్గిపోవడం ఇందుకు నిదర్శనం. గతేడాది జూన్ తో పోల్చితే ప్రస్తుత జూన్ లో బంగారం దిగుమతులు 86శాతం పడిపోయాయి. సాధారణంగా భారత్ ఏటా సుమారు 800 టన్నుల నుంచి 900 టన్నుల వరకు బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అంటే సగటున నెలకు 70 టన్నుల నుంచి 80 టన్నుల మేరకు బంగారం దిగుమతి అవుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లాక్ డౌన్ లో దాదాపు 99శాతం గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గిపోగా… మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంత మేరకు పుంజుకుంటున్నాయి. కానీ సాధారణ పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం దిగుమతులు 15శాతం తక్కువగా ఉండటం వల్ల ఆ ప్రభావం బంగారం ధరల పై పడుతున్నది. అవకాశాన్ని మార్కెట్లు, ట్రేడర్లు అనుకూలంగా మలుచుకుని ధరలు అమాంతం పెంచుతున్నారన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి ఎంతకాలం ఈ పెరుగుదల ఉంటుందో వేచి చూడాలి.