పొలిటికల్ పార్టీలకు షాక్ ఇచ్చిన గూగుల్

పొలిటికల్ పార్టీలకు షాక్ ఇచ్చిన గూగుల్

Google-ads

Google pausing all political ads : గూగుల్ కంపెనీ సరికొత్త నిర్ణయం రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చింది. గూగుల్‌లో రాజకీయ ప్రకటనలు నిలిపివేసింది. 2021, జనవరి 14వ తేదీ గురువారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అమెరికాలోని క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాయిటర్స్ సంస్థ రిపోర్ట్ చేసింది. ఈ నిషేధం జనవరి 21 వరకు అమల్లో ఉండనుంది. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ తీసుకోనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కూడా గూగుల్ రాజకీయ ప్రకటనల విషయంలో పాక్షిక బ్యాన్ విధించింది.

అయితే, ఎన్నికలు ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత మళ్లీ ప్రకటనలకు అనుమతి ఇచ్చింది. ఇటీవల అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్, గూగుల్ అనుబంధ అన్ని విభాగాల్లోనూ ఎలాంటి రాజకీయ ప్రకటనలను తీసుకోదు. ఇదో సున్నితమైన అంశం కాబట్టి, తాము ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నట్టు గూగుల్ తెలిపింది. అమెరికా అధ్యక్షుడి అభిశంసన, ప్రమాణస్వీకారం, నిరసనలకు సంబంధించి ప్రకటనలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని చెప్పింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఫేస్ బుక్ కూడా రాజకీయ ప్రకటనల మీద ఇప్పటికే నిషేధం విధించింది. గత నెలలో జార్జియాలో మాత్రం కొంచెం మినహాయింపులు ఇచ్చింది. విధ్వంసాలను, పరస్పర వ్యతిరేకతను ప్రోత్సహించే తరహా ప్రకటనలు తమ పాలసీకి విరుద్ధమని గూగుల్ కంపెనీ తెలిపింది.