భారత్ లో ట్రెండింగ్ యాప్…గూగుల్ ప్లే స్టోర్ నుంచి “Remove China Apps” తొలగింపు

  • Published By: venkaiahnaidu ,Published On : June 3, 2020 / 10:27 AM IST
భారత్ లో ట్రెండింగ్ యాప్…గూగుల్ ప్లే స్టోర్ నుంచి “Remove China Apps” తొలగింపు

భార‌త్‌ లో ట్రెండింగ్ యాప్‌ గా ఉన్న‌ రిమూవ్ చైనా యాప్స్(Remove China Apps) అనే ఫ్రీ యాప్‌ ను గూగుల్..తన ప్లే స్టోర్ నుంచి తొల‌గించింది. యాప్ స్టోర్ నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన కార‌ణంగా దీన్ని తీసేసిన‌ట్లు గూగుల్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. మే నెల చివరి వారం నుంచి ఇప్పటివరకు భారత్ లో ఈ యాప్ ను 50లక్షల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు.

క‌రోనా కల్లోలానికి చైనానే కార‌ణ‌మంటూ అమెరికా స‌హా ప‌లు దేశాలు చైనాను వేలెత్తి చూపిస్తున్న విష‌యం తెలిసిందే. అటు క‌రోనా అంశంతోపాటు స‌రిహ‌ద్దుల్లో ఘ‌ర్ష‌ణ కార‌ణంగా భార‌తీయుల్లోనూ చైనాపై వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది. గడిచిన నెలరోజులుగా హిమాలయాల సరిహద్దులో చైనా-భారత్ ల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో ఈ యాప్ పాపులారిటీ భారత్ లో కొన్ని రోజులుగా విపరీతంగా పెరిగిపోయింది.

రిమూవ్ చైనా యాప్ విష‌యానికి వ‌స్తే.. ఇది మ‌న ఫోన్‌లో ఉన్న అన్ని చైనా యాప్‌ల‌ను గుర్తించి, వాటి స‌మాచారాన్ని అందిస్తుంది. ఈ యాప్స్ ప‌క్క‌నే రెడ్ క‌ల‌ర్‌లో డిలీట్ ఆప్ష‌న్ కూడా ఉంటుంది. . దాన్ని సెల‌క్ట్ చేయ‌గానే స‌ద‌రు యాప్ అన్ ఇన్‌స్టాల్ అవుతుంది. 4.8 రేటింగ్‌తో దూసుకుపోయిన ఈ యాప్‌ను వ‌న్ ట‌చ్ యాప్ ల్యాబ్స్ అనే సంస్థ రూపొందించింది. 

స్వ‌దేశీ యాప్స్‌గా చెప్పుకుంటున్న వాటికి గూగుల్ వ‌రుస‌గా షాక్ లు ఇస్తూనే ఉంది. ఇప్ప‌టికే టిక్‌ టాక్‌కు పోటీగా వచ్చిన మిట్రాన్‌ను తొల‌గించిన విష‌యం తెలిసిందే. మిట్రాన్ 5 మిలియ‌న్ల డౌన్‌లోడ్ల‌తో విశేషాద‌ర‌ణ పొందింది. ఫలితంగా టిక్‌టాక్ రేటింగ్స్ ప‌డిపోయాయి. కానీ అంత‌లోనే గూగుల్ టిక్‌టాక్‌కు పాత రేటింగ్‌నే కేటాయించిన విషయం తెలిసిందే.

Read: iOS 13 రన్ అయ్యే అన్ని ఐఫోన్లలో iOS 14 కొత్త అప్‌డేట్