ఇక అక్కడ ఉచిత వైఫై దొరకదు

  • Published By: vamsi ,Published On : February 18, 2020 / 05:22 AM IST
ఇక అక్కడ ఉచిత వైఫై దొరకదు

రైల్వేస్టేషన్‌లలో ఉచిత వైఫై సర్వీసుల విషయంలో గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది.  దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్‌లలో అందిసున్న ఉచిత వైఫై సేవలను ఎత్తివేస్తున్నట్లు గూగుల్‌ వెల్లడించింది. భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ఇప్పుడు చాలా చవకగా మారిపోయాయని, అందుకే భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా, నైజీరియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లో ఉచిత వైఫై సేవలను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించారు. 

భారతదేశంలో ఇప్పటివరకు 400కి పైగా స్టేషన్లలో వైఫై సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఐదేళ్ల క్రితం గూగుల్ స్టేషన్లు ప్రారంభించిన సమయంలో డేటా వాడకం చాలా ఖర్చుతో కూడుకున్నదిగా ఉన్నదని, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.  2015లో భారతీయ రైల్వే, రైల్ టెల్ భాగస్వామ్యంతో గూగుల్ వేగవంతమైన, ఉచిత పబ్లిక్ వైఫై సేవలను ప్రారంభించింది. జూన్ 2018 నాటికి 400స్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి.

అయితే ఐదేళ్ల కాలంలో మొబైల్ డేటా ధర 95 శాతం తగ్గింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం దేశంలోని వినియోగదారులు నెలకు సగటున 10 జీబీ డేటా వాడుతుండగా.. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే గూగుల్ రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సర్వీసు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది కంపెనీ.