Covid Vaccine : కరోనా నుంచి కోలుకున్న 9 నెలల తర్వాతే టీకా.. కేంద్రానికి కీలక సిఫార్సు

Covid Vaccine : కరోనా నుంచి కోలుకున్న 9 నెలల తర్వాతే టీకా.. కేంద్రానికి కీలక సిఫార్సు

Covid Vaccine

Covid Vaccine 9 Months : కరోనా నుంచి కోలుకున్న వారికి టీకా ఎప్పుడు వేయాలి? ఎన్ని నెలల తర్వాత టీకా వేస్తే మంచిది? ఎంత సమయం తీసుకోవాలి? ఇలాంటి అంశాలపై ప్రభుత్వ ప్యానెల్‌ నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌(ఎన్‌టీఏజీఐ) కేంద్రానికి కీలక సిఫార్సు చేసింది. కరోనా నుంచి కోలుకున్న 9 నెలల తర్వాత టీకా వేయాలని సిఫార్సు చేసింది. గతంలో ఆరు నెలల వ్యవధి ఉండాలని సూచించిన ఈ ప్యానెల్‌.. ఇప్పుడు దాన్ని తొమ్మిది నెలలకు పెంచింది. తాజా ప్రతిపాదనలను ప్యానెల్‌ కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ఆరోగ్యశాఖ ప్రస్తుత ప్రొటోకాల్‌ ప్రకారం.. కరోనా బారినపడ్డ వారు.. కోలుకున్నాక 4-8 వారాల తర్వాత కొవిడ్‌ టీకా తీసుకోవచ్చు. అయితే ఈ వ్యవధి పెరిగితే శరీరంలో యాండీబాడీలు మరింత ఎక్కువగా వృద్ధి చెందుతాయని ఎన్‌టీఏజీఐ చెబుతోంది. ‘‘కరోనా సోకి కోలుకున్న వారు తొలి డోసు టీకా కోసం మరింత ఎక్కువ కాలం వేచి ఉంటే మంచిది. తొమ్మిది నెలల తర్వాత టీకా తీసుకున్నట్లయితే అది శరీరంలో ఎక్కువ మొత్తంలో యాంటీబాడీలు వృద్ధి చెందేందుకు దోహదపడుతుంది’’ అని ప్యానెల్‌ వివరించింది. ఇదిలా ఉండగా.. వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత ఆరు నెలలకు తొలి డోసు టీకా తీసుకుంటే మంచిదని డబ్ల్యూహెచ్‌వో కూడా చెబుతోంది.

వ్యాక్సినేషన్‌ విధానంపై ఎన్‌టీఏజీఐ ఇటీవల కొన్ని సిఫార్సులు చేసిన విషయం తెలిసిందే. బాలింతలు, గర్భిణీలు టీకా తీసుకోవచ్చని స్పష్టం చేసిన ప్యానెల్‌.. మొదటి డోసు తీసుకున్నాక కరోనా బారినపడితే.. కోలుకున్నాక 4-8 వారాలు వేచి ఉండి, తర్వాత రెండు డోసు వేయించుకోవచ్చని తెలిపింది. ప్లాస్మా చికిత్స చేయించుకున్నవారైతే.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక మూడు నెలలకు వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించింది. ఇక కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలకు పెంచాలని ఈ ప్యానెల్‌ చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించిన విషయం తెలిసిందే.

ఒక్కరోజే 4లక్షల మంది కోలుకున్నారు, దేశంలో ఇదే తొలిసారి:
కాగా, గత వారం రోజులుగా దేశంలో కరోనా కేసుల విషయంలో స్థిరీకరణ కనిపిస్తోంది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగడం భారీగా రిలీఫ్ ఇచ్చే అంశం. గత 24 గంటల్లో అత్యధికంగా 4లక్షలమందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. ఒక రోజులో ఈ స్థాయిలో కరోనా బాధితులు కోలుకోవడం దేశంలో ఇదే తొలిసారి. పాజిటివ్‌ కేసులతో పోలిస్తే అధికంగా 1.50లక్షలకు పైగా మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

తాజాగా కోలుకున్న వారితో కలిపితే మొత్తం 2.15కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారిలో ఒక్కరోజు వ్యవధిలో 4లక్షల మందికి పైగా కోలుకోవడం ఇదే తొలిసారి అని కేంద్రం తెలిపింది. తాజాగా 4,22,436 మంది రికవరీ అయ్యారని తెలిపింది. గత 14 రోజులుగా సగటున రోజుకు 3,55,944మందికి పైగా రికవరీ అవుతున్నారని వెల్లడించింది. మరోవైపు, గడిచిన 5 రోజులుగా కొత్త కేసుల కన్నా రికవరీలే భారీగా ఉన్నట్టు తెలిపింది. దేశంలో రికవరీ రేటు 85.60శాతంగా ఉన్నట్టు తెలిపింది.

ఇక మొత్తం కేసుల్లో 74.54శాతం కేసులు పది రాష్ట్రాల్లో నమోదవడం గమనార్హం. అత్యధికంగా కర్ణాటకలో 38,603.. తమిళనాడులో 33,075 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ ఉన్నాయి. ఇక మరణాల రేటు 1.10శాతంగా ఉండగా, గత 24 గంటల్లో 4329మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో అధ్యికంగా వెయ్యి మంది చనిపోగా, కర్ణాటకలో 476మంది కన్నుమూశారు.

ఇక ఇప్పటివరకూ 18.44 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను ఇచ్చారు. వ్యాక్సిన్‌ డే-122 (మే 17,2021)న 15,10,418 డోస్‌లను ఇచ్చారు. ఇందులో 12.67లక్షల మంది తొలి డోస్‌ తీసుకోగా, 2.43లక్షల మంది సెకండ్‌ డోస్‌ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,52,28,996 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 2,15,96,512 మంది రికవరీ కాగా.. 2,78,719మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 33,53,765 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తగ్గుతున్న కొత్త కేసులు.. పెరుగుతున్న మరణాలు:
దేశంలో కొద్ది రోజులుగా కొత్త కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మృత్యుఘోష మాత్రం ఆగట్లేదు. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయి మరణాలు సంభవించడం వైద్య వ్యవస్థకు సవాల్ గా మారింది. మంగళవారం(మే 18,2021) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం(మే 17.2021) 18,69,223 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2లక్షల 63వేల 533 మందికి పాజిటివ్‌గా తేలింది. వరసగా ఐదో రోజు కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరణాలు మాత్రం అత్యధికంగా నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 4వేల 329 మంది చనిపోయారు. ఇప్పటివరకు నమోదైన అత్యధిక మరణాలు ఇవే. మే 11 (4వేల 205)న మరణాలు సంభవించాయి.

కొత్త కేసుల తగ్గుదలతో యాక్టివ్ కేసుల్లో భారీ తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం 33,53,765 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 13.29 శాతంగా ఉంది. ఇంత ఉద్ధృతిలోనూ రికవరీల సంఖ్య ఊరటనిస్తోంది. నిన్న 4,22,436 మంది కోలుకున్నారు. మొత్తంగా 2,15,96,512 మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 85.60 శాతంగా ఉంది.

ఒక్క మహారాష్ట్రలోనే వెయ్యి మరణాలు..
సోమవారం మహారాష్ట్రలో భారీగా కరోనా మరణాలు సంభవించాయి. ఒక్కరోజులో వెయ్యిమంది ప్రాణాలు కోల్పోయారు. మార్చి 30 తర్వాత కొత్త కేసులు సంఖ్య 30వేల దిగువకు చేరినప్పటికీ.. మృతుల సంఖ్య ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. తాజాగా అక్కడ 26వేల 616 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం కర్ణాటక(38,603), తమిళనాడు(33,075)లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. కర్ణాటకలో 476 మంది మరణించగా..తమిళనాడు, ఢిల్లీలో 300 మందికి పైగా చనిపోయారు.