విదేశీ తబ్లిగీ జమాత్ సభ్యులపై 10ఏళ్ల నిషేధం

  • Published By: venkaiahnaidu ,Published On : June 4, 2020 / 12:11 PM IST
విదేశీ తబ్లిగీ జమాత్ సభ్యులపై 10ఏళ్ల నిషేధం

ఢిల్లీలో తబ్లిగీ జమాత్‌కు హాజరైన విదేశీయులపై భారత్ కఠిన నిర్ణయం తీసుకుంది. 960మందికి పైగా విదేశీ తబ్లిగీ జమాత్ సభ్యులును బ్లాక్ లిస్ట్ లో పెట్టి వాళ్లు 10ఏళ్లు భారత్ కు రాకుండా నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే హోంశాఖ వర్గాల నుంచి అందుతున్న సమచారం ప్రకారం…బ్లాక్ లిస్ట్ లో పెట్టబడే విదేశీయుల సంఖ్య 2వేల వరకు చేరవచ్చు. 

ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ అనుమతి లేని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి… ఏపీ,తెలంగాణతో సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో పాటు విదేశాలకు చెందిన ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం వారిలో కొందరు దేశంలోని పలు రాష్ట్రాలకు రైళ్లలో,బస్సుల్లో ప్రయాణించారు. అందులో కొందరు తెలంగాణలోని కరీంనగర్‌కు కూడా వచ్చిన విషయం తెలిసిందే.

అయితే, తబ్లిగీ జమాత్‌‌ వల్ల ఢిల్లీలో పాటు దేశంలో పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. తబ్లిగీ జమాత్ నిర్వహించిన మౌలానా సాద్ పై కూడా ఢిల్లీలో కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన తర్వాత కూడా వేల సంఖ్యలో ఢిల్లీ హెడ్ క్వార్టర్ లో ఉన్న దేశీయ,విదేశీ తబ్లిగీ సభ్యులను ఆ బిల్డింగ్ నుంచి క్వారంటైన్ సెంటర్ కు తరలించడానికి రెండు,మూడు రోజులు పట్టిన విషయం తెలిసిందే.

టూరిస్ట్ మరియు ఈ-వీసాలతో భారత్ లోకి వచ్చిన దాదాపు 960మంది తబ్లిగీ సభ్యులు ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించేందుకు అర్హులు అని గత నెల ఢిల్లీ పోలీసులు ఢిల్లీ హైకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. చాలామంది విదేశీయులు వీసా నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమం తబ్లిగీ జమాత్ లో పాల్గొన్నారని కోర్టుకి తెలిపారు. కాగా, ఇప్పుడు భారత ప్రభుత్వం 960 మంది విదేశీ తబ్లిగీ సభ్యుల మీద పదేళ్ల పాటు భారత్ లోకి రాకుండా నిషేధం విధించినట్టు తెలిసింది. కేంద్రహోంశాఖ బ్లాక్ లిస్ట్ లో పెట్టినవాళ్లల్లో నలుగురు అమెరికన్లు,తొమ్మది మంది బ్రిటీషర్లు,ఆరుగురు చైనా దేశాలకు చెందినవాళ్లు కూడా ఉన్నారు.