ట్రంప్ కి మురికివాడలు కన్పించకుండా…గోడ కడుతున్న గుజరాత్ సర్కార్

  • Published By: venkaiahnaidu ,Published On : February 13, 2020 / 04:04 PM IST
ట్రంప్ కి మురికివాడలు కన్పించకుండా…గోడ కడుతున్న గుజరాత్ సర్కార్

ఫిబ్రవరి-24,2020న అగ్రరాజ్యం అధ్యక్షుడు సతీసమేతంగా ఢిల్లీలో అడుగుపెట్టనున్నాడు. రెండు రోజులపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతలో పర్యటించనున్నారు. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొట్ట మొదటి భారత పర్యటన. సెనేట్‌లో తనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయిన తర్వాత ఆయన ఇక్కడకు వస్తున్నారు.

తన భారత పర్యటనలో గుజరాత్ ని కూడా సందర్శించనున్నారు ట్రంప్. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. గతేడాది లోక్ సభ ఎన్నికల ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ కోసం అమెరికాలో ఎలాంటి ఏర్పాట్లు జరిగాయో దాదాపు అదే శైలిలో అమెరికా అధ్యక్షుడి రాక సందర్భంగా గుజరాత్‌లోనూ సన్నాహాలు జరుగుతున్నాయి. హ్యూస్టన్‌లో జరిగిన ‘హౌడీ మోడీ’ తరహాలోనే అహ్మదాబాద్‌లో ‘కేమ్ ఛో ట్రంప్’ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. గుజరాతీలో ‘కేమ్ ఛో ట్రంప్’ అంటే ‘ఎలా ఉన్నారు ట్రంప్’ అని అర్థం. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతారని చెబుతున్నారు. ఆ వేదికపై ట్రంప్‌తోపాటు భారత ప్రధాని మోదీ కూడా ఉండబోతున్నారు.

అయితే, అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఉన్న ఒక మురికివాడ కనిపించకుండా చేయడానికి గోడ కట్టడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ మురికివాడ ఎయిర్‌పోర్ట్ నుంచి సబర్మతి ఆశ్రమానికి వెళ్లే దారిలో ఉంటుంది. స్థానిక పత్రికల్లో గురువారం ప్రచురించిన ఒక కథనం ప్రకారం ఈ ప్రాంతంలో ప్రధాన మార్గం పక్కనే ఉన్న మురికివాడను కనిపించకుండా చేయడానికి ఆరేడు అడుగుల ఎత్తు గోడ కడుతున్నారు. ఈ గోడ దాదాపు అర కిలోమీటర్ పొడవు ఉంటుంది. 

	wall.jpg

అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు. గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం పేదరికాన్ని దాచిపెట్టాలని, మురికివాడను కనిపించకుండా చేయాలని అనుకుంటోందని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వానికి అవి సమస్యగా అనిపిస్తే, అక్కడివారికి పక్కా ఇళ్లు ఎందుకు కట్టించడం లేదని ప్రశ్నించారు.

ఆ మురికివాడలో ఉండే ఓ మహిళ మాట్లాడుతూ…రెండు మూడు రోజుల నుంచీ పని జరుగుతోంది. ఈ గోడ కడితే మా బస్తీ మూసుకుపోతుంది. గాలి, నీళ్లు ఆగిపోతాయి. ఇక్కడ మురుగు కాలువలు లేవు, కరెంటు, నీళ్లు లేవు. చీకట్లో ఉండాల్సి వస్తోంది. ఉన్న చిన్న దారిలో జనం పడుతూ లేస్తూ వెళ్తుంటారు. వర్షం వస్తే, ఇక్కడ మోకాళ్లలోతు నీళ్లొస్తాయని తెలిపారు. ఈ గోడ కట్టకపోతే మా సమస్య ఏంటో కనీసం ఈ దారిలో వెళ్లే అమెరికా అధ్యక్షుడికైనా కనిపిస్తుంది కదా. కానీ, ప్రభుత్వం నిజాలు దాచిపెట్టాలని అనుకుంటోందని  మరో స్థానిక మహిళ అన్నారు.

ఈ ప్రాంతం విమానాశ్రయానికి దగ్గరగా ఉంది. దాంతో, నగరానికి ఎప్పుడు వీఐపీలు వచ్చినా, మురికివాడ ఉన్న ప్రాంతం పక్కనే తెరలు కట్టేవారు. అది కనిపించకుండా కప్పేసేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అక్కడ ఏకంగా గోడే కట్టి, ఆ ప్రాంతాన్ని పూర్తిగా కనిపించకుండా దాచేయాలని ప్రయత్నిస్తోంది అన్నారు. మా పేదరికంపై తెరలు వేసి, గోడ కట్టి మూసేయడానికి బదులు ప్రభుత్వం మాకు సౌకర్యాలు కల్పించాలి. దానివల్ల మా జీవితాలు మెరుగుపడతాయి అని ఓ మహిళ అన్నారు. మీడియా కథనాల ప్రకారం ట్రంప్, ప్రధాని మోదీ అహ్మదాబాద్ మొటేరా ప్రాంతంలో ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద సీటింగ్ సామర్థ్యంతో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియంను కూడా ప్రారంభించనున్నారు.