రైతన్నల పోరాటం 50 డేస్, కేంద్రం 9వ దఫా చర్చలు

రైతన్నల పోరాటం 50 డేస్,  కేంద్రం 9వ దఫా చర్చలు

Govt-farmers : సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న అన్నదాతల పోరాటం 50 రోజులను పూర్తి చేసుకుంది. 2021, జనవరి 15వ తేదీ శుక్రవారం రైతులతో కేంద్ర ప్రభుత్వం 9వ దఫా చర్చలు నిర్వహిస్తోంది. ఈ 9వ విడత చర్చల్లో చెప్పుకోదగిన పురోగతి ఉంటుందని తాము భావించడం లేదని రైతు సంఘాల నేతలు చెప్పారు. శుక్రవారం జరగనున్న చర్చల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతిని గుర్తు చేస్తుందని.. అంతకు మించి పెద్దగా చర్చ జరిగే అవకాశం ఏమీ లేదన్నారు. అయితే జరగనున్న చర్చలు సఫలం కాకపోతే మాత్రం.. జనవరి 26న తాము ట్రాక్టర్లతో భారీ కవాతును నిర్వహిస్తామని స్పష్టం చేశాయి.

ఇటు రైతు చట్టాలపై అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నుంచి భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు భూపీందర్ సింగ్ మన్ తప్పుకున్నారు. రైతుల ప్రయోజనాలపై రాజీ పడే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీలో భూపీందర్ సింగ్ మన్ ఒకరు. ఇప్పటికే ఈ కమిటీ తమకు అంగీకారం కాదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. రైతు చట్టాలను సమర్థించిన నలుగురితో కమిటీ ఏర్పాటు చేయడాన్ని ఆక్షేపిస్తున్నాయ్‌. కేంద్ర చ‌ట్టాల‌ను ప‌రిశీలించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల క‌మిటీ తొలి స‌మావేశం ఈ నెల 19న జ‌రగనుండగా.. అంతకు ముందే కమిటీలోని సభ్యుడు భూపిందర్ సింగ్ మన్ తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.

* విజ్ఞాన్ భవన్ లో 9వ విడత చర్చలు.
* ఇప్పటికే 8 సార్లు చర్చలు.
* కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పట్టుబడుతున్న రైతులు.
* చట్టాలను సవరిస్తామంటున్న కేంద్రం.

* ఇప్పటికే అగ్రిచట్టాలపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు.
* చట్టాలను పరిశీలించేందుకు నిపుణులతో కమిటీ.
* ఈ నెల 19న నిపుణుల కమిటీ తొలి మీటింగ్.
* కమిటీపై రైతులు అభ్యంతరం.