త్రివిధ దళాధిపతి…సీడీఎస్ గా బిపిన్ రావత్

  • Published By: venkaiahnaidu ,Published On : December 24, 2019 / 12:58 PM IST
త్రివిధ దళాధిపతి…సీడీఎస్ గా బిపిన్ రావత్

దేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(CDS)నియామకానికి ఇవాళ(డిసెంబర్-24,2019)కేంద్రకేబినెట్ ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రిత్వ శాఖలోని మిలటరీ పవర్స్ డిపార్ట్మెంట్ కు సీడీఎస్ అధిపతిగా ఉంటారని కేబినెట్ భేటీ అనంతరం కేంద్రమంత్రి ప్రకాష్ జావడేకర్ తెలిపారు. సీడీఎస్ నియామకం దేశ అత్యున్నత రక్షణ వ్యవస్థలో ఓ పెద్ద సంస్కరణ అని జావడేకర్ తెలిపారు. 

అయితే మొదటి సీడీఎస్ పేరును ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పేరు ఇందులో ముందువరుసలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. డిసెంబ‌ర్ 31వ తేదీన ఆర్మీ చీఫ్‌గా రావ‌త్ రిటైర్‌ కానున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌నే ముందు వ‌ర‌సలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

సైనిక సంస్కరణల్లో భాగంగా త్రివిధ దళాలను సమన్యయపరిచే సీడీఎస్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే దోవల్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం, ఆ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఇవాళ ఆమోదం తెలపడం జరిగింది.

త్రివిధ దళాధిపతులను సీడీఎస్ డైరక్ట్ చేస్తాడు. శత్రుత్వాల విషయంలో సరైన సైనిక ప్రతిస్పందన కోసం కొత్త ఆదేశాలను సృష్టిస్తాడు.  జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియమించిన అమలు కమిటీ సిడిఎస్ కోసం చార్టర్ ను నిర్వచించింది. ప్రభుత్వానికి సింగిల్ పాయింట్ సైనిక సలహాదారుగా సిడిఎస్ ఉంటారు. కె సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కార్గిల్ సమీక్ష కమిటీ సిఫారసు చేసిన దానికి అనుగుణంగా ఇది ఉంది. 2000ఫిబ్రవరిలో ఈ కమిటీ తన రిపోర్ట్ ను పార్లమెంట్ ముందు ఉంచిన విషయం తెలిసిందే. ప్రస్తుత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తండ్రే ఈ సుబ్రమణ్యం.