మోడీకి మాత్రమే : గాంధీ కుటుంబానికి SPG భద్రత ఉపసంహరణ!

  • Published By: venkaiahnaidu ,Published On : November 8, 2019 / 10:14 AM IST
మోడీకి మాత్రమే : గాంధీ కుటుంబానికి SPG భద్రత ఉపసంహరణ!

గాంధీ కుటుంబానికి (సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ)ఎస్పీజీ భద్రతను ఉపసంహరించుకోవాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. z+సెక్యూరిటీని గాంధీ ఫ్యామిలీకి కల్పించి ఎస్పీజీ తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తో జడ్+సెక్యూరిటీని వారికి ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌కు కూడా ప్రత్యేక భద్రతా బృందం(SPG) భద్రతను కేంద్రం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.

20ఏళ్ల క్రితం మాజీ ప్రధానులు హెచ్ డీ దేవెగౌడ, వీపీ సింగ్ లకు కూడా ఇదే విధంగా ఎస్పీజీ సెక్యూరిటీని ఉపసంహరించిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా కొన్నేళ్ల పాటు ఇంటికే పరిమితమైన మాజీ ప్రధాని వాజ్ పేయి చనిపోయిన 2018 వరకు ఎస్పీజీ భద్రత కల్పించారు. 

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత ప్రధానుల భద్రత కోసం 1985లో ఎస్పీజీ వ్యవస్థ ఏర్పాటు అయింది. 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత మాజీ ప్రధానులు, వారి కుటుంబాలకు 10ఏళ్ల పాటు ఎస్పీజీ భద్రత కల్పించే విధంగా ఎస్పీజీ చట్టానికి సవరణ చేశారు. 2003లో మాజీ ప్రధాని వాజ్ పేయి…10 ఏళ్ల నుంచి ఒక ఏడాదికి లేదా కేంద్రం నిర్ణయించిన ముప్పు స్థాయిని బట్టి ఎస్పీజీ సెక్యూరిటీ కల్పించేలా చట్టానికి మరోసారి సవరణ చేశారు.

ఎస్పీజీలో 3 వేలకు పైగా సిబ్బంది ఉన్నారు. బెదిరింపు అవగాహన ఆధారంగా ఈ ప్రత్యేక బృందం ప్రధానమంత్రులతో పాటు మాజీ ప్రధానమంత్రులు, వారి కుటుంబాలను కవర్ చేస్తుంది. ప్రస్తుతం ఎస్పీజీ హోదా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షురాలు సోనియా, రాహుల్‌, ప్రియాంకా గాంధీ వాద్రాలకు కొనసాగుతోంది. ఇప్పుడు గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించాలని నిర్ణయించడంతో ఇకపై ప్రధాని నరేంద్రమోడీ మాత్రమే ఎస్పీజీ భద్రతను కలిగి ఉంటారు.