గవర్నమెంట్ టీచర్ సంపాదన కోటి రూపాయలు.. ఒకేసారి 25 స్కూళ్లలో ఉద్యోగం

  • Published By: Subhan ,Published On : June 5, 2020 / 01:47 PM IST
గవర్నమెంట్ టీచర్ సంపాదన కోటి రూపాయలు.. ఒకేసారి 25 స్కూళ్లలో ఉద్యోగం

ఉత్తరప్రదేశ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(KGBV)లో టీచర్ సంపాదన తెలిస్తే షాక్ అయిపోతారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆమె ఆ ఒక్కటే కాకుండా ఒకే సమయంలో ఇతర చోట్లా పనిచేసి సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదించింది. టీచర్ల డేటాబేస్ స్టార్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

ప్రాథమిక విద్యా శాఖ ఆధారంగా టీచర్ల డిజిటల్ డేటాబేస్ రెడీ చేస్తున్నారు. ఒకే టీచర్ 25స్కూళ్లలో పనిచేస్తున్నట్లుగా అప్పుడే తెలిసింది. అనామికా శుక్లా KGBVలో ఫుల్ టైం టీచర్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా అమేథి, అంబేద్కర్ నగర్, రాయబరేలీ, ప్రయాగ్ రాజ్, అలీఘర్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పనిచేస్తుంది. 

2020 ఫిబ్రవరి నెల వరకూ అంటే 13నెలల్లో ఆమె మోసపూరితంగా కోటి రూపాయల జీతం సంపాదించింది. ‘ఈ విషయం సోషల్ మీడియా ద్వారానే మాకు తెలిసింది. డాక్యుమెంట్లను బట్టి చూస్తే అనామిక శుక్లా కాంట్రాక్ట్ బేస్ మీద సైన్స్ టీచర్ గా పనిచేస్తుంది. 4జిల్లాల్లో ఆమె కాంట్రాక్ట్ అమౌంట్ రూ.5లక్షలు. ప్రస్తుతం ఆమె అందుబాటులో లేరు’ అని ఉత్తరప్రదేశ్ ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డా.సతీశ్ ద్వివేది అన్నారు. 

ఆమెపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు చెప్పారు. రికార్డుల ప్రకారం.. అనామిక శుక్లా మణిపూర్ జిల్లా వాసి. ఆమెకు డిపార్ట్‌మెంట్ నోటీసులు కూడా పంపింది. పైగా ఆమె అన్ని స్కూళ్ల జీతాలు ఒకే బ్యాంక్ అకౌంట్ కు క్రెడిట్ అవుతూ వస్తున్నాయి. 

‘ఈ ఆరోపణలు నిజమని తేలితే ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖను ఆదేశించాం. మా ప్రభుత్వం వచ్చాక డిజిటల్ డేటాబేస్ తీసుకొచ్చి స్పష్టతను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇందులో ఎవరైనా అధికారులు ఇన్‌వాల్వ్ అయితే వారిపైనా చర్యలు తప్పవు. KGBVలోనూ కాంట్రాక్ట్ బేస్ మీద టీచర్లను తీసుకుంటున్నాం. ఆమె గురించి డిపార్ట్‌మెంట్ విచారణ జరుపుతుంది’ అని మంత్రి అన్నారు.