అంతిమంగా రైతుల ముందు ప్రభుత్వం తలొగ్గాల్సిందే..ఇప్పుడే చట్టాలు రద్దు చేయడం బెటర్

అంతిమంగా రైతుల ముందు ప్రభుత్వం తలొగ్గాల్సిందే..ఇప్పుడే చట్టాలు రద్దు చేయడం బెటర్

rahul gandhi

Rahul Gandhi కేంద్రంపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఢిల్లీ సరిహద్దులో దాదాపు 70 రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతుల గోడును కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మన కోసం కష్టపడే రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఏ పని చేయడం కోసం మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నరో ఆ పని చేయండి మోడీజీ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

బుధవారం మధ్యాహ్నాం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధానకార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ..ఢిల్లీని రైతులు చుట్టుముట్టారు. వాళ్లు మనకు ఆహారం అందించేవాళ్లు. ఢిల్లీ ‘గడీ’లా ఎందుకు మార్చబడింది? ఎందుకు మనం వాళ్లని భయపెడుతున్నాం..కొడుతున్నాం..చంపుతున్నాం?ప్రభుత్వం ఎందుకు వారితో మాట్లాడటం లేదు..సమస్యను పరిష్యను పరిష్కరించట్లేదు?ఈ సమస్య దేశానికి మంచిదికాదు. నూతన వ్యవసాయ చట్టాలను రెండేళ్లపాటు నిలిపివేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ ప్రకటించడం వెనుక అర్థమేంటి?చట్టాలను రద్దు చేయాలనుకుంటున్నారా లేదా. రైతులు చెప్పేది విని సాధ్యమైనంత తొందరగా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలి. చట్టాలు రద్దు అయ్యే వరకు ఆందోళన విరమించే ప్రశక్తే లేదంటున్నారు రైతులు. చివరకు ప్రభుత్వం తలొగ్గాల్సిందే..అది ఇప్పుడే చేయడం మంచిది అని రాహుల్ అన్నారు.

ఇక, ఫిబ్రవరి-1న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​ దేశంలోని 99 శాతం మంది ప్రజలకు అన్యాయం చేసి.. కేవలం ఒక శాతం మంది సంపన్నులకు మేలు చేసేలా ఉందని ఈ సందర్భంగా రాహుల్​ విమర్శించారు. దేశంలోని పేదలు, శ్రామికులు, రైతులు, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల సంపదను తీసుకెళ్లి 5 నుంచి 10 మంది ధనికుల జేబుల్లో కేంద్రం పెడుతోందని ధ్వజమెత్తారు. పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చే ప్రవేటీకరణ గురించే కేంద్రం మాట్లాడుతోందని రాహుల్​ అన్నారు. ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకోవాలంటే ప్రజలకు నేరుగా ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగం ద్వారానే ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకుంటుందని, సరఫరా ద్వారా కాదని తెలిపారు.