40కిలోల వెండి ఇటుకతో శంకుస్థాపన, ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయం.. అయోధ్య రామ మందిరం విశేషాలు

  • Published By: naveen ,Published On : August 5, 2020 / 09:25 AM IST
40కిలోల వెండి ఇటుకతో శంకుస్థాపన, ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయం.. అయోధ్య రామ మందిరం విశేషాలు

కోట్లాది మంది హిందువుల కల సాకారం కానుంది. నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చారిత్రక అయోధ్య నగరంలో రామ మందిర
నిర్మాణానికి అంకురార్పణ పడనుంది. బుధవారం(ఆగస్టు 5,2020) భూమి పూజ కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని మోడీ ఈ మధ్యాహ్నం రామ మందిర నిర్మాణానికి పునాది రాయి వేయనున్నారు. అతిరథ మహారథుల సమక్షంలో భూమి పూజ జరగనుంది. రామాలయ నిర్మాణం కోసం కొన్ని దశాబ్దాల పాటు కోర్టుల్లో మహా సంగ్రామమే నడిచింది. చివరికి మార్గం సుగమైంది. ఈ రోజు.. చరిత్రలో నిలిచిపోనుంది.

Image

మూడున్నరేళ్లలో పూర్తికానున్న ఆలయ నిర్మాణం:
కలియుగాన అయోధ్య మరోమారు పట్టం కడుతోంది. దాదాపు 500 సంవత్సరాల పాటు విశ్వాసాలు, విధ్వంసాల చరిత్ర గొడవల్లో నలిగి…అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో అందరికీ ఆమోదయోగ్యంగా….సయోధ్యకు ప్రతీకగా…మళ్లీ సరయూ తీరంలో…అదే అయోధ్యలో ఘనంగా కొలువు తీరబోతున్నాడు శ్రీరాముడు. ఊరూరా కొలువై ఉన్న కోదండ రాముడికి ఆయన జన్మించిన అయోధ్య నగరంలో దివ్య మందిరాన్ని నిర్మించేందుకు బుధవారం అంకురార్పణ జరగబోతోంది. వేద పఠనం, మంత్రోచ్ఛరణల మధ్య బుధవారం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్‌ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా దాదాపు 40 కిలోల వెండి ఇటుకతో ఆలయానికి శంకుస్థాపన చేస్తారు.

Image

అయోధ్య వేడుకకు సంబంధించి టాప్ అప్ డేట్స్:
1. ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి లక్నోకి పయనం అవుతారు. అక్కడ నుంచి చాపర్ లో అయోధ్య చేరుకుంటారు. ముందుగా హనుమాన్ గడీ ఆలయంలో ఆంజనేయుడికి పూజలు చేస్తారు. ఆ తర్వాత భూమి పూజ స్థలానికి చేరుకుంటారు.

2. వేద పఠనం, మంత్రోచ్ఛరణల మధ్య బుధవారం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్‌ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా దాదాపు 40 కిలోల వెండి ఇటుకతో ఆలయానికి శంకుస్థాపన చేస్తారు. భూమి పూజ కార్యక్రమంలో గంగా, యమున, సరస్వతి- త్రివేణి సంగమం నుంచే కాకుండా దేశంలోని 11 పవిత్ర ప్రదేశాల నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టి, జలాలను వినియోగిస్తున్నారు. సరిగ్గా 32 సెకన్లపాటు ఈ ముహూర్త కార్యక్రమం ఉంటుంది. 3 అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు, స్తంభాలతో 161 అడుగుల ఎత్తులో అత్యంత అద్భుతంగా, అపురూపంగా మందిరాన్ని నిర్మించనున్నారు. గతంలో ప్లాన్ చేసిన దాని కన్నా ఇప్పుడు డబుల్ ఎత్తులో మందిరాన్ని నిర్మించనున్నారు.

Image

3. కరోనా ముప్పు నేపథ్యంలో కొద్దిమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. ప్రధాని మోడీ సహా 50మంది వీఐపీలనే (యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్‌ భాగవత్‌) భూమి పూజ కార్యక్రమానికి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆహ్వానించింది.అలాగే ఇక్బాల్ అన్సారీని కూడా ఆహ్వానించారు.

4. యావత్‌ భారతావని వీక్షించేందుకు వీలుగా ఈ మహా క్రతువును దూరదర్శన్‌లో ప్రసారం చేయనున్నారు. బీజేపీ అగ్రనేతలు ఎల్‌.కె.అద్వాని, మురళీ మనోహర్‌ జోషి తదితరులు ఈ మహాక్రతువుకు స్వయంగా హాజరు కాలేకపోతున్నా.. వీడియో ద్వారా వీక్షించనున్నారు.

5. భూమిపూజ కార్యక్రమానికి తాను వెళ్తానని, కానీ ఆ సమయానికి అక్కడ ఉండనని బీజేపీ నాయకురాలు ఉమాభారతి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆమె ట్వీట్ చేశారు. శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన అనంతరం తను ఆ ప్రదేశాన్ని సందర్శిస్తానన్నారు. హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు కోవిడ్-19 బారిన పడడం తనకు ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్న ఆమె.. అయోధ్యలో జరిగే ఈవెంట్ కి వేలాది మంది హాజరవుతున్న దృష్ట్యా.. ప్రధాని మోడీ గురించిన చింత తనకు ఉందన్నారు. ఆ సమయానికి నేను సరయు నదీ తీరాన ఉంటానని ఉమాభారతి తెలిపారు.

6. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, శివసేన కూడా ఆలయ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. కానీ భూమిపూజ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించలేదు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిజెపితో 35 సంవత్సరాల బంధాన్ని సేన తెంచుకుంది. కాగా, రామాలయానికి శివసేన “రక్తం, చెమట” ఇచ్చిందని, అలాంటి తమ పార్టీని ఆహ్వానించాల్సిందేనని డిమాండ్ చేసింది.

Image

7. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆహ్వానం అందలేదు. కాగా, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ రామాలయంపై స్పందించారు. రాముడు అందరితోనూ ఉన్నాడు. రామ జన్మభూమిలో జరగబోయే భూమిపూజ వేడుక దేశ ఐక్యతకు, సోదరభావానికి, సాంస్కృతిక సమ్మేళనానికి ఓ సందర్భం కావాలి. నిరాడంబరత, ధైర్యం, నిగ్రహం, త్యాగం, నిబద్ధత వీటన్నింటి శ్రీరాముడు ప్రతీకగా నిలుస్తాడు అని ట్వీట్ చేశారు.

8. 1990లో అద్వానీ రథయాత్రతో రామమందిరం నిర్మాణం ఉద్యమానికి నాంది పడింది. డిసెంబర్ 6, 1992 న, కర సేవకులు 16వ శతాబ్దపు మసీదును ధ్వంసం చేశారు. మొఘల్ చక్రవర్తి బాబర్ రాముడు జన్మించిన ప్రదేశంలో మసీదు నిర్మించారని చెబుతారు. ఆ తర్వాత జరిగిన హింసలో 2 వేలకు పైగా ప్రజలు మరణించారు.

9. అల్లర్ల వెనుక బీజేపీ నేతలు అద్వానీ, జోషి, ఉమా భారతి, కళ్యాణ్ సింగ్ హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. నాయకులు మత విద్వేషాలను రెచ్చగొట్టే స్పీచ్ లు ఇచ్చారని సీబీఐ చెప్పింది. కాగా, తమపై వచ్చిన ఆరోపణలను నేతలు ఖండించారు.

10. సుదీర్ఘ విచారణ తర్వాత సుప్రీంకోర్టు అంతిమ తీర్పు ఇచ్చింది. రామాలయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2.77 ఎకరాల భూమిలో రామాలయాన్ని నిర్మించనున్నారు.

రామ మందిర భూమి పూజ కోసం అయోధ్యకు రానున్న ప్రధాని మోడీ.. నగరంలో దాదాపుగా మూడు గంటలపాటు ఉంటారు. తొలుత ప్రఖ్యాత హనుమాన్‌ గఢీలో ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకుంటారు. ఆపై ఆలయ నిర్మాణం జరగనున్న ప్రాంతానికి వెళ్తారు. రామ్‌ లల్లాను దర్శించుకుంటారు. మందిరానికి శంకుస్థాపన చేస్తారు.

మూడో అతిపెద్ద హిందూ ఆలయం:
కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షగా, సనాతన హిందూధర్మానికి ప్రతీకగా ఈ విశ్వమందిరాన్ని నిర్మించబోతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో 5 గోపురాలతో 69 ఎకరాల్లో మూడు అంతస్థుల్లో- 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతుంది. గర్భగుడి దగ్గర దాదాపు 40 కిలోల వెండితో కూడిన పైకప్పును కూడా ఏర్పాటుచేయనున్నారు. ప్రపంచంలోని మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా ఇది చరిత్రకెక్కనుంది. ప్రస్తుతం అంకోర్‌వాట్‌లోని దేవాలయ సముదాయం ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంది. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం రెండో స్థానంలో ఉంది.