పెళ్లయిన కొన్ని గంటల్లోనే కరోనాతో వరుడు మృతి, పెళ్లికి హాజరై వారిలో 111మందికి కొవిడ్

పెళ్లయిన కొన్ని గంటల్లోనే కరోనాతో వరుడు మృతి, పెళ్లికి హాజరై వారిలో 111మందికి కొవిడ్

బీహార్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించి చేసుకున్న పెళ్లి ఆ ఇంట్లో అంతులేని విషాదాన్ని నింపింది. పెళ్లయిన తెల్లారే కరోనాతో పెళ్లికొడుకు చనిపోయాడు. పెళ్లికి వచ్చిన అతిథుల్లో 111మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.

పెళ్లయిన మరుసటి రోజే వరుడు మృతి:
బీహార్‌లోని పట్నా జిల్లా పాలిగంజ్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గుర్‌గావ్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి జూన్‌ 15న వివాహం నిశ్చయమైంది. తేదీ దగ్గరపడటంతో నాలుగు రోజుల ముందే సొంతూరుకు చేరుకున్నాడు. అయితే అప్పటికే కరోనా లక్షణాల్లో ఒకటైన డయేరియాతో అతడు బాధపడుతున్నాడు. అయినా కుటుంబసభ్యులు ఇవేమీ పట్టించుకోలేదు. ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని చెప్పి బలవంతంగా పెళ్లి జరిపించారు. జూన్‌ 15న గ్రాండ్ గా వివాహం జరిగింది. 350 మంది వరకు అతిథులు హాజరయ్యారు. కాగా, సమస్య తీవ్రమవడంతో అదేరోజు వరుడు ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించి జూన్‌ 16న మరణించాడు. అయితే ఈ విషయాన్ని చెప్పకుండానే బంధువులు అంత్యక్రియలు కూడా చేసేశారు.

400 మందికి కరోనా పరీక్షలు, 11మందికి కోవిడ్:
ఆ తర్వాత దీని గురించి స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు వివాహానికి, అంతిమ సంస్కారాలకు హాజరైన సుమారు 400 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 111 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారందరిని ఐసోలేషన్‌కు తరలించారు. జూన్‌ 24 నుంచి 26 వరకు ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి మరీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు అధికారులు.

కరోనాతో గేమ్స్ వద్దు:
ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. అంతా షాక్ అవుతున్నారు. జనాలంతా ఒకేచోట గుమికూడితే కరోనా మహమ్మారి ఏ విధంగా వ్యాప్తి చెందుతుందనడానికి ఇదో పెద్ద ఉదాహరణ అని అధికారులు చెబుతున్నారు. కరోనాతో గేమ్స్ వద్దని, చాలా జాగ్రత్తగా ఉండాలని సూస్తున్నారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా నిబంధనలు పాటించాలని, కరోనా కట్టడికి సహకరించాలని కోరుతున్నారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. పెళ్లి వేడుకలకు 50 మందికి మించి హాజరుకాకూవడని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఉల్లంఘించడంపై జిల్లా మేజిస్ట్రేట్ సీరియస్ అయ్యారు.

కాగా, దేశంలో అతితక్కువ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో బీహార్‌ ఒకటి. రాష్ట్రంలో కరోనా అధికమవుతుండటంతో రోజుకు 15 వేల పరీక్షలు నిర్వహించాలని సీఎం నితీష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. బీహార్‌లో ఇప్పటివరకు 9వేల 744 కరోనా కేసులు నమోదవగా, 62 మంది మరణించారు.

Read:భారత్‌లో 6లక్షలకు చేరువలో కరోనా కేసులు, 17వేలు దాటిన మరణాలు