రిలీఫ్ : చింతపండుపై GST ఎత్తివేత, హోటల్ గదులు చౌక

  • Published By: madhu ,Published On : September 21, 2019 / 12:57 AM IST
రిలీఫ్ : చింతపండుపై GST ఎత్తివేత, హోటల్ గదులు చౌక

బడ్జెట్‌లో కార్పొరేట్ వర్గాలకు సపోర్ట్ చేసినట్లే కనిపించినా కేంద్రం సామాన్యులనూ కనికరిస్తోంది. దేశీయ కంపెనీలపై కార్పొరేట్ పన్ను తగ్గించిన కేంద్రం.. లేటెస్ట్‌గా జీఎస్టీ రేట్లను సవరించింది. మెరైన్ ఇంధనంపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. చింతపండుపై 5 శాతం ఉన్న జీఎస్టీని పూర్తిగా ఎత్తివేసారు. వెట్ గ్రైండర్లపై ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతం తగ్గిస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పారు. 

గోవాలో సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం భేటీ అయిన 37వ జీఎస్టీ కౌన్సిల్ దేశంలోని వాహన, ఆతిథ్య పరిశ్రమలకు ఊతమిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో వాహనాల అమ్మకాలు తగ్గిన వేళ.. 1200 సీసీ ఇంజన్‌ సామర్థ్యమున్న పెట్రోల్‌ వాహనాలపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 1 శాతానికి తగ్గించాలని కౌన్సిల్‌ నిర్ణయించింది. హోటల్ రూమ్ సేవలపై జీఎస్టీ భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. డైమండ్స్‌పై 5 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గించారు.

ప్లాటినం దిగుమతి చేసుకొని వాటితో ఆభరణాలు రూపొందించి ఎగుమతి చేస్తే జీఎస్టీ నుంచి మినహాయింపు నిచ్చారు. భారత్‌లో జరిగే ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్ కప్ నిర్వహణకు అవసరమయ్యే వస్తువులు, సేవలపై జీఎస్టీ మినహాయింపు కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తయారు కాని రక్షణ ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా మినహాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఆహారం, వ్యవసాయ సంస్థ ఎఫ్‌ఏవో చేపట్టే కొన్ని ప్రాజెక్టులపై జీఎస్టీని విధించబోమని స్పష్టం చేశారు. చేపల ఆహారంతో పాటు గిలకలు, ఇతర వ్యవసాయ పరికరాలను కొంత కాలం వరకూ జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నామని చెప్పారు. 

కెఫిన్‌ ఉన్న డ్రింక్స్‌పై జీఎస్టీ కౌన్సిల్‌ పన్నును పెంచింది. ప్రస్తుతం కెఫిన్‌ ఆధారిత పానీయాలపై 18 జీఎస్టీ విధిస్తుండగా, దాన్ని 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై అదనంగా 12 శాతం సెస్‌ విధిస్తామని తెలిపింది. దుస్తులు, బ్యాగులు సహా పలు వస్తువులకు వాడే జిప్‌లపై జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించింది. మొత్తం 20 వస్తువులు, 12 రకాల సేవలపై జీఎస్టీని సవరించారు. సవరించిన జీఎస్టీ రేట్లు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.