ఇళ్లపై తగ్గనున్న జీఎస్టీ భారం

ఇళ్లపై తగ్గనున్న జీఎస్టీ భారం

ఇళ్లు కొనుక్కోవాలన్నా.. కట్టుకోవాలన్నా జీఎస్టీ గురించి భయపడే అవసరమే లేదు. నివాసిత గృహాలపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి, నిర్మాణంలో ఉన్న ఇళ్ల ప్రాజెక్టులపై జీఎస్టీని 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గిపోతున్నాయి. గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ అధ్యక్షతన మంత్రుల బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ గత నెలలో ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి తొలి సమావేశాన్ని మంత్రుల బృందం శుక్రవారం ఢిల్లీలో నిర్వహించింది.

 

జీఎస్టీ విధానంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను పరిశీలించి, పన్ను రేట్లపై చర్చలు జరిగాయి. ఈ మేర వారం రోజుల్లోపే నివేదికను సిద్ధం చేసి వచ్చే వారం జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ముందుంచనున్నట్టు ఓ అధికారి తెలిపారు. నిర్మాణంలో ఉన్న లేదా నిర్మాణం పూర్తి చేసుకున్న ఫ్లాట్లపై ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ సదుపాయంతో అమలు చేస్తున్నారు.

 

నిర్మాణం పూర్తయినట్టు ధ్రువీకరణ ఇచ్చిన ఇళ్లపై కొనుగోలుదారుల నుంచి జీఎస్టీని వసూలు చేయడం లేదు. అయితే, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ సదుపాయాన్ని బిల్డర్లు వినియోగదారులకు బదిలీ చేయడం లేదని ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈ అంశాలను పరిశీలించి తగిన సూచనలకు గాను జీఎస్టీ కౌన్సిల్‌ జనవరి 10న మంత్రుల బృందాన్ని నియమించింది.