గుజరాత్ లో హత్రాస్ ఘటన ? 15 ఏళ్ల బాలికకు మత్తు ఇచ్చి, సామూహిక అత్యాచారం

  • Published By: murthy ,Published On : October 5, 2020 / 10:55 AM IST
గుజరాత్ లో హత్రాస్ ఘటన ? 15 ఏళ్ల బాలికకు మత్తు ఇచ్చి, సామూహిక అత్యాచారం

Gujarat Girl:దేశంలో హత్రాస్ ఘటన మరువక ముందే గుజరాత్ లో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. మహిసాగర్ జిల్లాలో మహిళపై జరిగిన అత్యాచారం… జామ్ నగర్ లో 15 ఏళ్ళ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారంతో రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్ధకమైందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జామ్ నగర్ లోని మహదేవ్ నగర్ లోని కోడియార్ కాలనీలో సెప్టెంబర్ 28న…. 15 ఏళ్ల మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. అంతకు ముందు వారు బాలికకు మత్తు పదార్ధాలు ఇచ్చి బాలిక స్పృహ కోల్పోయేట్టు చేశారు. అనంతరం వారు నలుగురూ ఆమెపై సామూహికంగా లైంగిక దాడి చేశారు.



బాధిత బాలిక నిందితుల్లో ఒకరికి స్నేహితురాలు. బాలిక తన స్నేహితుడిని కలటానికి వెళ్లినప్పుడు అతను ఆమెకు మత్తు పదార్ధాలు ఇచ్చి స్పృహ కోల్పోయేట్టు చేశాడు. అనంతరం తన ముగ్గరు స్నేహితులను పిలిచాడు. నలుగురు కలిసి ఆమె పై సామూహిక అత్యాచారం చేశారు.

బాధితురాలికి మెలుకువ వచ్చి పరిస్ధితిని అర్ధం చేసుకుని, ఇంటికి వెళ్ళి తల్లి తండ్రులకు జరిగిన విషయం చెప్పింది. వారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. విచారణలో భాగంగా నలుగురు నిందితులలో ముగ్గురిని అరెస్ట్ చేసారు.



అరెస్టైన వారిలో దర్శన్ భాటియా, మిలన్ భాటియా, దేవ్‌కరన్ గాద్విలు ఉన్నారు…పరారీలో ఉన్న మోహిత్ భాటియా కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 కింద, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు జామ్ నగర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (రూరల్) ఏపీ. జడేజా చెప్పారు.



గుజారాత్ లోనే జరిగిన మరో ఘటనలో…. మహీసాగర్ జిల్లాలోని సాంత్రాంపూర్లో 15 రోజుల క్రితం 35 ఏళ్ల మహిళను ఇద్దరూ వ్యక్తులు పలు మార్లు బెదిరించి అత్యాచారం చేశారు. నిందితులు సెల్ ఫోన్ రీ చార్జ్ బుత్ నుండి బాధితురాలి నెంబరు తీసుకుని ఆమెకు ఫోన్ చేసి వేధించి, బెదిరించి ఆమెపై అత్యాచారం చేశారు. ఈ ఘటనలో నిందితులపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 (డి), 507 సెక్షన్ల కింద సాంత్రాంపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.