గుజరాత్ మోడల్ తెలిసింది…బీజేపీపై రాహుల్ సెటైర్లు

  • Published By: venkaiahnaidu ,Published On : June 16, 2020 / 09:53 AM IST
గుజరాత్ మోడల్ తెలిసింది…బీజేపీపై రాహుల్ సెటైర్లు

బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. గుజరాత్​లో కరోనా మరణాల రేటుకు సంబంధించి అధికార బీజేపీపై  విమర్శలు గుప్పించిన  రాహుల్ గాంధీ…అధిక మరణాల రేటులో గుజరాత్​ మోడల్​ అంటే ఏంటో చూపించారంటూ ఎద్దేవా చేశారు. 

దేశ సగటుకన్నా గుజరాత్ లో రెట్టింపు కరోనా మరణాలు నమోదవుతున్నాయని రాహుల్ విమర్శించారు. గుజరాత్​ మోడల్ అంటే ఇదేననంటూ బీజేపీ ఫై  వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

కొవిడ్- 19 మరణాలు రేటు: గుజరాత్​ 6.25 శాతం, మహారాష్ట్ర 3.73 శాతం, రాజస్థాన్​ 2.32 శాతం, పంజాబ్​ 2.17 శాతం, పుదుచ్చేరి 1.98 శాతం, ఝార్ఖండ్​ 0.5 శాతం, ఛత్తీస్​గఢ్​ 0.35 శాతం. గుజరాత్​ మోడల్​ ఏంటో తెలిసిపోయింది అంటూ రాహుల్ ఓ ట్వీట్ చేశారు.  

కరోనా కేసుల సంఖ్యలో గుజరాత్​ దేశంలో నాలుగో స్థానంలో ఉంది. గుజరాత్ లో  ఇప్పటివరకు మొత్తం 24,055 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మంగళవారానికి 1,505కు చేరింది. రాష్ట్రంలోని కరోనా వ్యాప్తి భారీగా విజృంభించిన అహ్మదాబాద్​లో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయినా రోజుకు సగటున 488 కేసులు నమోదవుతున్నాయి. గత నెలలో గుజరాత్‌లో ప్రతిరోజూ సగటున 400 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 75 శాతానికి పైగా కేసులు ఒక్క అహ్మదాబాద్‌ లోనే నమోదయ్యాయి. 

కాగా,కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గురత్ లో మరోసారి లాక్ డౌన్  విధించే అవకావం ఉందని వస్తున్న ఊహాగానాలను  సీఎం విజయ్ రూపాని  కొట్టిపారేశారు. గుజరాత్ లో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు.