Gujarat : గుజరాత్​ నగరపాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం..భాణ్వఢ్​లో కమలానికి గట్టి షాక్

​గుజరాత్​ నగరపాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.

Gujarat : గుజరాత్​ నగరపాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం..భాణ్వఢ్​లో కమలానికి గట్టి షాక్

Gj

Gujarat Civic Polls  ​గుజరాత్​ నగరపాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు మూడు మున్సిపాలిటీలు(ఓఖా,భాణ్వఢ్, థారా)లకు ఆదివారం ఎన్నికలు జరగ్గా..మంగళవారం ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 104 స్థానాలకు గాను ఏకంగా 95 చోట్ల విజయం సాధించి బీజేపీ సత్తా చూపించింది. దీంతో కమలం పార్టీ కార్యకర్తలు బాణాసంచా పేల్చి,స్వీట్లు పంచి సంబరాలు చేసుకుంటున్నారు.  అయితే గాంధీనగర్,​ ఓఖా, థారా నగరపాలక సంస్థల్లో బీజేపీ విజయ దుందుభి మోగించినప్పటికీ..ఇప్పటివరకు బీజేపీ అడ్డగా ఉన్న భాణ్వఢ్​లో కాంగ్రెస్​ గెలిచింది. ​

గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్(జీఎంసీ)లో తొలిసారిగా బీజేపీకి ఫుల్ మెజార్టీ వచ్చింది. మొత్తం 44 స్థానాలకు గాను 41 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ రెండు స్థానాల్లో,ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది.

ఓఖాలో 36 స్థానాలకు..బీజేపీ 34 స్థానాల్లో,కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించింది. థారాలో 24 స్థానాలకు 20 చోట్ల బీజేపీ విజయం సాధించగా..కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించింది. అయితే 1995 నుంచి అధికారంలో కొనసాగుతున్న ద్వారకా జిల్లాలోని భాణ్వఢ్​లో ఈ సారి బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.​ భాణ్వఢ్​లో 24 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 16 స్థానాల్లో కాంగ్రెస్​ విజయం సాధించి అధికారం చేజిక్కించుకుంది. బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది.

కాగా,ఈ ఎన్నికలు వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ లో జరగాల్సి ఉండింది. అయితే ఆ సమయంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేశారు. కరోనా కేసులు తగ్గిన క్రమంలో ఆదివారం ఎన్నికలు నిర్వహించగా..మంగళవారం ఫలితాలు వెలువడ్డాయి.

అయితే,ఇటీవల గుజరాత్ సీఎం సహా మొత్తం కేబినెట్ ను మార్చిన బీజేపీకి తాజా ఎన్నికలు ఓ అగ్నిపరీక్షలా మారిన నేపథ్యంలో..ఫలితాల్లో సత్తా చూపించి రాష్ట్రంపై పట్టు నిలుపుకుంది బీజేపీ. ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై ప్రధాని మోదీ,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,కేంద్రహోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ నేతలు ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తం చేస్తూ..గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తల కృషిని కొనియాడారు.

ALSO READ : రైతులపై దూసుకెళ్లిన కారు వీడియో వైరల్‌..సీబీఐ దర్యాప్తు చేయించాలని సీజేఐకి లాయర్ల విజ్ణప్తి