3రోజుల శిశువు ఒంటిపై 20కత్తి గాట్లు

3రోజుల శిశువు ఒంటిపై 20కత్తి గాట్లు

20కత్తి గాట్లతో మూడు రోజుల వయస్సున్న పాపను క్రికెట్ ఆడుకుంటున్న యువకులు చూసి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగింది. బుధవారం పాపను హాస్పిటల్‌లో చేర్పించగా ప్రాణాలతో బయటపడిందని వైద్యులు తెలిపారు. మాహిక్, తెబచాడా గ్రామాల మధ్యలో ఉన్న ప్రాంతంలో క్రికెట్ ఆడుకోవడానికి కొందరు పిల్లలు వెళ్లారు. 

మధ్యలో శిశువు ఏడుస్తున్నట్లుగా వినిపించింది. శబ్దాన్ని అనుసరిస్తూ అటు వెళ్లేసరికి ఓ కుక్క తన పళ్లతో శిశువును కరిచేందుకు సిద్ధమైంది. రాళ్లతో కుక్కను తరిమి పాపను హాస్పిటల్‌లో చేర్పించారు. ట్రీట్మెంట్ చేసిన వైద్యులు పాపకు ప్రమాదమేమీ లేదని.. కుక్క కరవడానికి ముందే చిన్నారి ఒంటిపై 20వరకూ కత్తి గాట్లు ఉన్నాయని చంపేందుకు ప్రయత్నించి వదిలేసి ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు. 

హాస్పిటల్‌కు తీసుకువచ్చే సమయానికి పాప నోట్లో మట్టి ఇరుక్కుపోయిందని, దాంతో ఊపిరి ఆడక ఇబ్బంది పడిందని చెప్పారు. ప్రస్తుతం పాపకు ఏ ప్రమాదం లేదని పోలీసులకు సమాచారం అందించామని వెల్లడించారు.