రెండున్నరేళ్ల చిన్నారి బ్రెయిన్ డెడ్..అవయవదానంతో..ఐదుగురికి ప్రాణదానం

రెండున్నరేళ్ల చిన్నారి బ్రెయిన్ డెడ్..అవయవదానంతో..ఐదుగురికి ప్రాణదానం

Gujarat Organs of 2 and a half year old dead child gives new lease of life to five : దానాలు అన్నింటిలోకెల్లా అన్నదానం గొప్పదని పెద్దలు చెబుతుంటారు. ఎంత దానం చేసిన చాలు అనేది అన్నదానం ఒక్కటే కాబట్టి. కానీ ప్రస్తుత రోజుల్లో అన్ని దానాల్లోకి అవయవదానం చాలా గొప్పది అంటున్నారు. కారణం చనిపోతూ మరికొంతమందికి ప్రాణదానం చేయటం చాలా గొప్ప విషయంకదా.. మనిషి చనిపోతే శరీరంతోపాటు అన్ని అవయవాలు శిథిలమైపోతాయి. ఎవ్వరికి ఉపయోగపడవు. కానీ నేటి రోజుల్లో అవయవదానాల వల్ల ఎన్నో ప్రాణాలు నిలబడుతున్నాయి.

ఈక్రమంలో పట్టుమని మూడేళ్లు కూడా లేని ఓ చిన్నారి మరణం మరో ఐదుగురు ప్రాణాలు నిలబట్టేలా చేసింది. బ్రెయిన్ డెడ్ అయిన చిన్నారి కుటుంబ సభ్యలు అనుమతితో ఆ చిన్నారి అవయవాలను డాక్టర్లు మరో ఐదుగురికి అమర్చారు.  తాము బిడ్డను కోల్పోయినా మరికొంతమంది కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని పెద్ద మనస్సు చేసుకున్న ఆ చిన్నారి కుటుంబం తమ కడుపుకోతను భరిస్తూనే తమ బిడ్డ అవయవాలను దానం చేయటానికి ముందుకొచ్చింది.

వివరాల్లోకి వెళితే..గుజరాత్‌కు  చెందిన జర్నలిస్ట్  సంజీవ్‌ ఓజా దంపతులు సూరత్‌లోని భతార్ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ రెండో అంతస్తులు నివసిస్తున్నారు. వారికి యష్‌ ఓజా అనే రెండున్నరేళ్ల బాబు ఉన్నాడు. ఆడుతూ పాడుతూ.. సంతోషంగా ఎదుగుతున్న యష్‌ దురదృష్టవశాత్తు డిసెంబర్ 9న రెండో అంతస్తులో ఉన్న వారి ఇంటి బాల్కనీ నుంచి జారి కింద పడిపోయాడు. దీంతో బాబును అమృతా హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదంలో జాష్ తలకు బలమైన దెబ్బతగిలి మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయింది.

చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. దీంతో రెండున్నరేళ్ల చిన్నారి జాష్ డిసెంబర్ 14న బ్రెయిన్‌ డెడ్‌ అయ్యాడని డాక్టర్లు తెలిపారు. దీంతో వారి కుటుంబం భోరున విలపించింది. గెంతులేసే పసిబిడ్డడికి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయని గుండెలవిసేలా ఏడ్చారు. అంత శోకంలోనే జాష్ తల్లిదండ్రులు పెద్ద మనస్సులో ఆలోచించారు.

sutath boy Organs

యష్‌ మరణం గురించి తెలుసుకున్న ‘‘డోనేట్‌ లైఫ్‌’’ అనే ఎన్‌జీఓ అధ్యక్షుడు  నీలేష్ మాండ్లేవాలా హాస్పిటల్ కు చేరుకుని తల్లిదండ్రులను కలుసుకుని.. వారి బిడ్డ అవయవాలు దానం చేసేలా వారిని ఒప్పించారు. భౌతికంగా తమకు దూరమైన బిడ్డ.. మరి కొందరికి ప్రాణం పోసి.. వారిలో జీవించి ఉంటాడని భావించిన తల్లిదండ్రులు కడుపుశోకంతో కుమిలిపోతూనే తమ బిడ్డ అవయవాలు దానం చేయడానికి అంగీకరించారు.

దీంతో యష్‌ చిన్నారి గుండెని రష్యాకు చెందిన నాలుగేళ్ల చిన్నారికి.. ఊపిరితిత్తులను ఉక్రెయిన్‌కు చెందిన మరో చిన్నారికి.. అహ్మదాబాద్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలకు కిడ్నీలను.. భావ్‌నాగర్‌కు చెందిన మరో రెండేళ్ల చిన్నారికి యష్‌ లివర్‌ని అమర్చారు. యష్ రెండు కళ్లు మరో ఇద్దరికి అమర్చనున్నారు.

యష్ అవయవాల దానంతో మృత్యుముఖంలోకి వెళ్లాల్సిన ఐదుగురు తమ ఆయువును పెంచుకున్నారు. ఇక బిడ్డను కోల్పోయిన యష్‌ తల్లిదండ్రులు వారిలో తమ బిడ్డను చూసుకుంటూ ఆ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ముద్దులొలికే తమ బిడ్డడి చిట్టి మోమును మాత్రం మరచిపోలేకపోతున్నారు. ఎంతైనా అమ్మానాన్నలు కదూ..