గుజరాతీయులకు హెచ్చరిక :రోడ్లపై పాన్ ఊస్తే 14వేలు జరిమానా

  • Published By: venkaiahnaidu ,Published On : April 12, 2019 / 02:15 PM IST
గుజరాతీయులకు హెచ్చరిక :రోడ్లపై పాన్ ఊస్తే 14వేలు జరిమానా

ప్రపంచంలో పాన్ నమిలే అలవాటు ఎక్కువగా భారతీయులకు ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.మనదేశంలో నివసించే పాన్ ప్రియులకు రోడ్లు,గోడలు అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పాన్ ఊసేయడం,గోడలపై పాన్ పెయింటింగ్ లు వేయడం మనం రోజూ చూస్తూనే ఉంటాం.అయితే దేశం మారినంత మాత్రాన అలవాటులు పోవుగదా. కొంతమంది పాన్ ప్రియులు మాకు ఏ దేశమైనా ఒకటే అంటున్నారు.ఎక్కడైనా సరే తాము ఇలాగే ఉంటామంటూ అక్కడి ప్రభుత్వాలకు ఆగ్రహం తెప్పిస్తున్నారు.అయితే మా దేశంలో అలాంటివి కుదరనివ్వబోమంటోంది బ్రిటన్. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పాన్ ఊసే భారతీయులకు బ్రిటన్ షాక్ ఇచ్చింది.పాన్ నమిలితే వచ్చే కిక్కు…బ్రిటన్ తీసుకున్న నిర్ణయంతో దిగిపోతుంది.

బ్రిటన్ లోని లైసెస్టర్ సిటీలోగుజరాతీలు నివసించే ఏరియాలో సిటీ పోలీస్ ఫోర్స్,లైసెస్టర్ సిటీ కౌన్సిల్ కొన్ని సైన్ బోర్డులను ఏర్పాటు చేసింది.పాన్ నమిలి రోడ్డుపై ఊయడం అనారోగ్యకరమైనది,యాంటీ సోషల్ అని సైన్ బోర్డులపై రాసి ఉంది.స్థానిక ప్రజలు,ముఖ్యంగా గుజరాతీయులను హెచ్చరిస్తూ సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు.

రోడ్లపై,గోడలపై పాన్ ఊస్తే 150పౌండ్లు(రూ.13,581) చెల్లించాల్సి ఉంటుందని ఇంగ్లీష్,గుజరాతి భాషల్లో సైన్ బోర్డ్స్ పెట్టారు.లైసిస్టర్ సిటీలో నివసించే భారతీయ పాన్ ప్రియుల విషయంలో గతంలో కూడా లైసిస్టర్ సిటీ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంది. అంతేకాకుండా గతంలో భారతీయ పాన్ ప్రియులు టార్గెట్ గా లండన్ కౌన్సిల్ 80పౌండ్లు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.