550మంది ఖైదీలను విడుదల చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

550మంది ఖైదీలను విడుదల చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

మానవీయ కోణంలో ఆలోచించి గురునానక్ దేవ్ పుట్టిన రోజు సందర్భంగా 550మంది ఖైదీలను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ శనివారం అధికారికంగా ప్రకటించారు. వీళ్లు సమాజానికి ప్రమాదకారకులు కాదని, సిక్కు గురు సిద్ధాంతాల ప్రకారం వీరిని విడుదల చేస్తున్నామని తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమోదం తెలియజేయడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా 9మంది ఖైదీల పట్ల ప్రత్యేక మినహాయింపు ఇవ్వడం బాగుందన్నారు. కేంద్రం దేశ వ్యాప్తంగా ఉన్న 8మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. పంజాబ్ మిలిటన్సీ పీరియడ్‌లో జైలు శిక్షకు గురైన ఓ సిక్కు వ్యక్తికి మరణశిక్ష నుంచి ఉపశమనం కలిగిస్తూ జీవితకాల జైలు శిక్షకు మార్పు చేశారు. 

మానవీయ కోణంలో స్పందించాలని సెప్టెంబర్ 14న అమిత్ షాకు పంజాబ్ రాష్ట్రం ప్రతిపాదన పంపింది. వీరంతా వృద్ధులైపోయారని ఇప్పటికే వారి కుటుంబాలతో గడిపే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ప్రకటనపై శిరోమణి అకాలీదల్ చీఫ్ సుఖ్‌భీర్ సింగ్ బాదల్ సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, అమిత్ షాకు కృతజ్ఞతలు తెలియజేశారు.