ఉద్యోగులకు కరోనా.. మూతపడ్డ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం

  • Published By: murthy ,Published On : December 14, 2020 / 10:07 AM IST
ఉద్యోగులకు కరోనా.. మూతపడ్డ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం

Guruvayoor temple closed  : కేరళ రాష్ట్రం, త్రిసూర్ లోని ప్రముఖ దేవాలయం గురువాయూర్‌ శ్రీకృష్ణ ఆలయాన్ని రెండు వారాలపాటు మూసివేయనున్నారు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో పనిచేస్తున్న 22 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆలయాన్ని మూసివేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈనేపథ్యంలో రెండు వారాలపాటు భక్తులను దర్శనాలకు అనుమతించడం లేదని ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక..కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ భక్తులకు ఆలయంలో ప్రవేశాలు కల్పించారు.

శబరిమల తీర్థయాత్రలు ప్రారంభమైన నేపథ్యంలో గురువాయూర్ దేవాలయంలో ఆన్‌లైన్ బుకింగ్ కూడా ప్రారంభించారు. భక్తులకు ప్రవేశం లేకుండా గురువాయూర్ ఆలయాన్ని మూసివేసినప్పటికీ పూజారులు మాత్రం ఆలయంలో క్రమం తప్పకుండా ఏకాంతంగా పూజాదికాలు కొనసాగిస్తారని ఆలయ అధికారులు వెల్లడించారు. కేరళలో నిన్న ఒకేరోజు 4,698 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 59,438కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,07,119 మంది కరోనా నుంచి కోలుకున్నారు.