Gyanavapi Mosque: జ్ఞానవాపి మసీదు అరుదైన చిత్రం చెప్పే అత్యంత ఆసక్తికర కథ..

Gyanavapi Mosque: జ్ఞానవాపి మసీదు అరుదైన చిత్రం చెప్పే అత్యంత ఆసక్తికర కథ..

Gnanavapi Masjid In Shivlinga (1)

Gyanavapi Mosque very rare painting సరిగ్గా 31 ఏళ్ల క్రితం వివాదం మొదలైంది. జ్ఞానవాపి మసీదుకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే… కాశీ విశ్వనాథుడి ఆలయం కూల్చివేత.. జ్ఞానవాపి మసీదు నిర్మాణం.. ఈ రెండూ ఔరంగజేబు హయాంలోనే జరిగాయి. మసీదును నిర్మించడానికి ఆలయాన్ని ధ్వంసం చేశారా ? లేదంటే ఆలయం ధ్వంసం చేసిన చోట మసీదు కట్టారా ? అసలు మసీదు ఉన్నచోట ఒకప్పుడు కాశీ విశ్వనాథుడి ఆలయం ఉండేదా ? లేదా ? అన్నదే ఇప్పుడు తేలాలి. అది తేలాలంటే ముందు చరిత్ర లోతుల్లోకి వెళ్లి చూడాలి.

ఇది జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన రేర్‌ ఫోటోస్‌లో ఒకటి. నిజానికి ఇదొక స్కెచ్. 1834లో బ్రిటీష్ అధికారి జేమ్స్ ప్రిన్సెప్ జ్ఞానవాపి మసీదును సందర్శించినప్పుడు దీన్ని గీశాడు. అందుకే ఇది మసీదుకు సంబంధించిన అరుదైన చిత్రంగా నిలిచిపోయింది. ఈ చిత్రాన్ని స్పష్టంగా గమనిస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న స్తంభాలు… హిందూ ఆలయాన్ని పోలి ఉన్నాయి. పైన నిర్మించిన మినార్ మాత్రం ఇస్లాం నిర్మాణ శైలిని పోలి ఉంది. ఆ కాలపు చరిత్రకారుడు.. సకీ ముస్తయిద్ ఖాన్ తన మాసిర్-ఎ-ఆలమ్‌గిరిలో ఆలయ కూల్చివేత గురించి ప్రస్తావించాడు. చక్రవర్తి ఆదేశం ప్రకారం, అతని అధికారులు కాశీలోని విశ్వనాథ ఆలయాన్ని కూల్చివేసినట్లు అందులో ఉంది.

Also read : GYANVAPI ROW : జ్ఞానవాపి మసీదులోకి శివలింగం ఎలా వచ్చింది ? వీడియోగ్రఫీ సర్వేలో ఏం తేలింది ?

ఇక జ్ఞానవాపి మసీదు పశ్చిమ గోడ వెనుక శృంగార గౌరీ, గణేశుడు, హనుమంతుడు, నంది విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నదే ఆ నంది. సాధారణంగా శివాలయాల్లో నంది విగ్రహాలు గర్భగుడికి కొంచెం దూరంలో.. శివలింగానికి అభిముఖంగా ఉంటాయి. కానీ.. ఇక్కడ ఉన్న నంది మాత్రం గర్భగుడి వైపు కాకుండా మసీదు వైపు చూస్తున్నట్లు ఉంటుంది. దీన్ని చూపిస్తూ… జ్ఞానవాపి మసీదు విశ్వేశ్వర ఆలయానికి అసలు గర్భగుడి అని పిటిషనర్లు వాదిస్తున్నారు. అయితే ఈ వాదనను మసీదు కమిటీ, మస్లీం సంఘాలు తప్పు పడుతున్నాయి. చారిత్రక ఆధారాలు లేకుండా ఇలాంటి పసలేని వాదనలు ఎవరూ నమ్మరని అంటున్నాయి. ఇలా జ్ఞానవాపి మసీదు వివాదంలో ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు.

చరిత్రను తవ్వి తీస్తే.. నాలుగు – ఐదు శతాబ్దాల మధ్య కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. భారత దేశ పాలకుల్లో ప్రముఖుడైన విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆరో శతాబ్దంలో మన దేశ పర్యటనకు వచ్చిన చైనా యాత్రికుడు హ్యుయెన్ త్సాంగ్ కూడా వారణాసి టెంపుల్‌ గురించి ప్రస్తావించాడు. అయితే 1194లో మహ్మద్‌ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్‌ ఐబక్‌… కన్నౌజ్‌ రాజును ఓడించినప్పుడు ఆ ఆలయాన్ని కూల్చివేసినట్లు చరిత్ర చెబుతోంది. 1211లో ఆలయాన్ని పునురుద్ధరిస్తే.. మళ్లీ 1489-1517 మధ్య సికందర్‌ లోఢీ హయాంలో కూల్చివేశారు. అయితే అక్బర్‌ హాయాంలో రాజా మాన్‌సింగ్‌ కాశీలో ఆలయాన్ని పునురుద్ధరించినా.. ఆయన కుమార్తె ముస్లీం కుటుంబానికి కోడలుగా వెళ్లిందన్న కారణంతో అప్పట్లో బ్రాహ్మణులు ఆలయాన్ని బహిష్కరించారు. 1585లో అక్బర్‌ హయాంలో మరోసారి కాశీ విశ్వనాథుడి ఆలయం నవీకరించారు. ఇక ఔరంగజేబు మొఘల్‌ సింహాసనం సొంతం చేసుకున్న తర్వాత 1669లో మరోసారి ఆలయాన్ని కూల్చేశారు. అప్పుడే విశ్వనాథుడి ఆలయమీదే మసీదు నిర్మించారని చెబుతారు. ఆలయంపై సేనలు దండెత్తడానికి వస్తున్నప్పుడు ఆలయ పూజారి జ్యోతిర్లింగంతో పాటు ఆలయంలో ఉన్నబావిలో దూకేశారని… ఇప్పుడు బావిలో ఉన్న శివలింగం అదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Also read : Gyanvapi Case: శివలింగం జాగ్రత్త, నమాజ్ ఆపకండి – జ్ఞానవాపి అంశంలో సుప్రీం ఆదేశం

ఇప్పటికీ మసీదు దక్షిణపు గోడను పరిశీలిస్తే.. రాతి శిలా తోరణాలు స్పష్టంగా కనిపిస్తాయి. సాదారణంగా మసీదుల్లో ఇలాంటి శిల్పకళ ఎక్కడా కనిపించదు. కేవలం హిందూ దేవాలయాల్లో మాత్రమే ఇలాంటి శిల్పకళ కనిపిస్తుంది. అయితే అప్పట్లో ఔరంగజేబు పూర్తిగా కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని కూల్చివేయకుండా సగం కూల్చి… దాని మీద మసీదు నిర్మించారన్న వాదన ఒకటి ఉంది. ఔరంగజేబు కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని కూల్చివేసిన స్థానంలోనే మసీదు కట్టినట్లు… 1698లో అంబర్‌ రాజు బిషన్‌ సింగ్‌ చెప్పినట్లు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే 1742లో కాశీ విశ్వనాథుడి ఆలయానికి పూర్వ వైభవం తేవాలని ప్రయత్నం చేసినా… నాటి నవాబుల వల్ల అది సాధ్యం కాలేదు. మరాఠా సుబేదార్‌ మల్హర్‌ రావు హోల్కర్‌ కోడలు అహిల్యాబాయ్‌ హోల్కర్‌ హయాంలో చేసిన ప్రయత్నాలు చివరకు ఫలించాయి. అలా అప్పుడు కట్టిందే… మనకు ఇప్పుడు కనిపిస్తున్న కాశీ విశ్వనాథుడి ఆలయం.

1991లో పీవీ నరసింహారావు హయాంలో ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకొచ్చారు. దానిప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి దేశంలో ఉన్న మసీదులు, దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలి. అయితే ఈ చట్టం చేయకముందే బాబ్రీ మసీదు వివాదం ఉండడంతో… అది ఈ చట్ట పరిధిలోకి రాలేదు. కానీ జ్ఞానవాపి వివాదం ఈ చట్ట పరిధిలో వస్తుంది. మరి మసీదులో శివలింగం… బయటపడిందన్న వాదనలతో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.