ఎల్లుండి నుంచి తెరుచుకోనున్న యోగాసెంటర్లు,జిమ్ లు…కొత్త రూల్స్ ఇవే

  • Published By: venkaiahnaidu ,Published On : August 3, 2020 / 04:59 PM IST
ఎల్లుండి నుంచి తెరుచుకోనున్న యోగాసెంటర్లు,జిమ్ లు…కొత్త రూల్స్ ఇవే

అన్‌లాక్ 3.0లో భాగంగా ఆగష్టు-5 నుంచి కంటైన్‌మెంట్ జోన్లలో మినహా మిగిలిన చోట్ల జిమ్‌లు, యోగా సెంటర్లు తిరిగి తెరుచుకునేందుకు అనుమతిచ్చిన కేంద్రం… ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇవాళ(ఆగష్టు-3,2020)విడుదల చేసింది. జిమ్‌లు, యోగా సెంటర్లలో ప్రతి ఒక్కరి మధ్య ఆరు అడుగుల దూరం కచ్చితంగా పాటించాలని కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.



జిమ్‌లు, యోగా సెంటర్ల నిర్వాహకులు భౌతిక దూరం విషయంలో కచ్చితమైన నిబంధనలు పాటించాలని కేంద్రం తెలిపింది. ఆయా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ చేయాలని ఆదేశించింది. కార్డు ద్వారా లేక కాంటాక్ట్‌లెస్ చెల్లింపులను ఎక్కువగా ప్రొత్సహించాలన్న కేంద్రం.. ఈ సెంటర్లలో స్టాఫ్ తక్కువగా ఉండేలా చూడాలని స్పష్టం చేసింది.

65 ఏళ్లు దాటిన వారు, ఇతర వ్యాధులతో బాధపడేవారు, గర్భిణీలు, 10 ఏళ్ల లోపు వారిని జిమ్‌లు, యోగా సెంటర్లలో అనుమతించవద్దని కేంద్రం సూచించింది. యోగా ఆసనాలు బహిరంగ ప్రదేశాల్లో వేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని కేంద్రం సూచించింది. ప్రతి బ్యాచ్‌కు మధ్య 15 నుంచి 30 నిమిషాల వ్యవధి ఉండేలా చూడాలని తెలిపింది.



అయితే ఆఎలాంటి కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే జిమ్, యోగా సెంటర్లలో అనుమతించాలని… థర్మల్ స్క్రీనింగ్ విధానాన్ని కచ్చితంగా పాటించాలని కేంద్రం తెలిపింది. ఈ సెంటర్లకు వచ్చేవారి వివరాలను నమోదు చేయాలని ఆదేశించింది. ఆక్సిజన్ లెవెల్ 95 శాతం కంటే తక్కువ ఉన్నవారిని యోగా ఆసనాలు వేసేందుకు అనుమతించవద్దని స్పష్టం చేసింది.