నేను శపించాను…26/11 హీరో చచ్చిపోయాడు

  • Published By: venkaiahnaidu ,Published On : April 19, 2019 / 09:57 AM IST
నేను శపించాను…26/11 హీరో చచ్చిపోయాడు

భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను శపించడం వల్లే 26/11 హీరో…IPS ఆఫీసర్ హేమంత్‌ కర్కరే చనిపోయాడని అన్నారు. గురువారం(ఏప్రిల్-18,2019)భోపాల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ….హేమంత్ నన్ను తీవ్రంగా వేధించాడు.దీంతో నువ్వు ఫినిష్ అయిపోతావ్ అని ఆయనను శపించాను.అప్పటి నుంచి ఆయనకు అశుభ ఘడియలు మొదలయ్యాయి.

నేను శపించిన రెండునెలల్లోపే  ఉగ్రవాదుల చేతుల్లో హేమంత్ కర్కరే చనిపోయారు అని సాధ్వి అన్నారు. ముంబై యాంటీ టెర్రరిస్ట్‌ విభాగానికి అధిపతిగా పనిచేసిన హేమంత్‌ కర్కరే 26/11 దాడిలో ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. అతని సేవలకు గుర్తింపుగా మరణానంతరం ఆయనకు అశోక్‌చక్ర అవార్డు ప్రకటించారు.

మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఒకరు. దీనిపై విచారణ చేపట్టిన హేమంత్‌ కర్కరే.. పేలుళ్లలో వాడిన ద్విచక్రవాహనం ప్రజ్ఞా పేరు మీదే నమోదై ఉందన్న ఆరోపణలతో ఆమెను అరెస్టు చేశారు.

2016లో ఆమెకు ఎన్‌ఐఏ క్లీన్‌ చిట్ ఇచ్చినప్పటికీ కేసును కొట్టి వేయడానికి కోర్టు మాత్రం అంగీకరించలేదు. దీంతో ప్రస్తుతం ఆమె బెయిల్‌ పై బయటకు వచ్చారు.రెండు రోజుల క్రితం బీజేపీలో చేరిన ఆమెను ఆ పార్టీ భోపాల్  లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే సాధ్వి లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలంటూ మాలేగావ్‌ పేలుళ్లలో కుమారుడిని కోల్పోయిన నిస్సార్‌ సయీద్‌ గురువారం ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టును ఆశ్రయించారు. విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా హీరోగా కీర్తింపబడిన హేమంత్ కర్కరే గురించి సాద్వి చేసిన వ్యాఖ్యలను భారతీయులు తీవ్రంగా ఖండిస్తున్నారు.