ఫిబ్రవరి నాటికి దేశంలో సగం మందికి కరోనా

  • Published By: venkaiahnaidu ,Published On : October 19, 2020 / 08:09 PM IST
ఫిబ్రవరి నాటికి దేశంలో సగం మందికి కరోనా

Half of Indians likely to have had coronavirus by next February వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి సగం మంది భారతీయులకు కరోనా వచ్చి వెళ్తదని కేంద్రప్రభుత్వం నియమించిన కమిటీ అభిప్రాయపడింది. దేశ జనాభా 130కోట్లమందిలో సగం మంది అంటే 65కోట్ల మంది భారతీయులు ఫిబ్రవరి నాటికి కరోనా వైరస్ బారినపడే అవకాశముందని అంచానా వేస్తున్నామని ప్రభుత్వ నియమిత కమిటీ సభ్యుడొకరు సోమవారం(అక్టోబర్-19,2020)తెలిపారు.

తమ గణిత విధాన(mathematical model)అంచనా ప్రకారం ప్రస్తుతం దేశ జనాభాలోని 30శాతం మందికి కరోనా సోకిందని..ఫిబ్రవరి నాటికి ఇది 50శాతానికి చేరుకుంటుందని కాన్పూర్ ఐఐటీ ఫ్రొఫెసర్ మరియు ప్రభుత్వ నియమిత కమిటీలోని సభ్యుడైన మన్నింద్ర అగర్వాల్ చెప్పారు.



సెప్టెంబర్ నాటికి దేశ జనాభాలోని దాదాపు 14శాతంమందికి కరోనా వైరస్ సోకి ఉండవచ్చన్న కేంద్ర ప్రభుత్వపు సెరొలాజికల్ సర్వే కన్నా ప్రస్తుత వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువ ఉన్నట్లు కమిటీ అంచనా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. సెరొలాజికల్ సర్వే సమయంలో శాంపిల్స్ సేకరణ కరెక్ట్ గా జరిగి ఉండకపోవచ్చునని అగర్వాల్ చెప్పారు. తాము ఓ కొత్త మోడల్ ని ఆవిష్కరించామని..దాని ప్రకారం రిపోర్ట్ చేయబడని కరోనా కేసులను కూడా పరిగణలోకి తీసుకుంటాన్నారు. ఆ విధంగా తాము వైరస్ సోకినవారిని రెండు వర్గాలుగా(రిపోర్ట్ చేసిన కేసులు,రిపోర్ట్ చేయబడనివి)విభజించవచ్చునని అగర్వాల్ చెప్పారు.



కరోనా అంతమయ్యే 2021 ఫిబ్రవరి చివరి నాటికి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1కోటి 5లక్షల వరకు ఉండవచ్చని కమిటీ తెలిపింది. ఒకవేళ, ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే తమ అంచనాలు దాటి కరోనా కేసులు నమోదవుతాయని కమిటీ హెచ్చరించింది. శీతాకాలంలో మరియు రాబోయే పండుగల నేపథ్యంలో వైరస్ కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని, ప్రజలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని,నిర్లక్ష్యం వహించరాదని కమిటీ సృష్టం చేసింది. మాస్క్ లు ధరించడం,సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే నెలకి 26లక్షల కరోనా కేసులు నమోదవుతాయని కమిటీ తెలిపింది.

కేరళలో ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఓనం పండుగ సందర్భంగా ప్రజలు ఎక్కువగా గుమిగూడారని.. స్నేహితులు, బంధువులను ఎక్కువగా కలిశారని, ఆ తర్వాత కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని వివరించారు. నవరాత్రులు, దసరా, దీపావళి, క్రిస్ట్‌మస్ లాంటి పండుగలను కొవిడ్ నిబంధనలను పాటిస్తూ జరుపుకోవాలని కమిటీ సూచించింది.



కాగా,ఇప్పటివరకు దేశంలో 75లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం వైరస్ కేసుల్లో ప్రపంచంలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా,భారత్ 2వ స్థానంలో నిలిచింది. అయితే సెప్టెంబర్ నెల మధ్య నుంచి భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అంతకుముందు దేశవ్యాప్తంగా రోజుకి 80వేలకు పైగా నమోదైన కేసులు…కొన్ని రోజులుగా తగ్గుతూ..రోజుకి 60వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.