హర్ ‌సిమ్రత్‌ రాజీనామా మోడీని “అణు బాంబులా” కుదిపేసింది

  • Published By: venkaiahnaidu ,Published On : September 25, 2020 / 08:34 PM IST
హర్ ‌సిమ్రత్‌ రాజీనామా మోడీని “అణు బాంబులా” కుదిపేసింది

వివాదాస్పద వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఇటీవల కేంద్ర మంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్ నాయకురాలు హర్ ‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే హర్‌ సిమ్రత్ రాజీనామా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కుదిపివేసిందని శిరోమణి అకాలీదళ్‌ నేత సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ అన్నారు.


శుక్రవారం(సెప్టెంబర్-25,2020) వ్యవసాయ బిల్లులకు నిరసనగా పంజాబ్‌లోని ముక్త్సర్‌ లో జరిగిన ర్యాలీలో సుఖ్బీర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా రైతుల గురించి ఎవరూ నోరెత్తలేదని, హర్‌సిమ్రత్‌ రాజీనామాతో రోజూ ఐదుగురు మంత్రులు ఈ అంశంపై మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అణు బాంబుతో జపాన్‌ ను కుదిపివేస్తే..రాజీనామా అనే అకాలీదళ్‌ వేసిన బాంబుతో మోడీ ప్రభుత్వం వణికిపోతోందని చెప్పారు.

అంతేకాకుండా, అక్టోబర్ 1 న పంజాబ్‌లో తాము నిర్వహించబోయే నిరసన ప్రదర్శన ఢిల్లీ సింహాసనాన్ని కదిలిస్తుందిని బాదల్ అన్నారు. ఇక వ్యవసాయ బిల్లులకు నిరసనగా పంజాబ్‌లో ఎస్‌ఏడీ ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. మరోవైపు ఈ బిల్లులను అడ్డుకోవాలని ఎస్‌ఏడీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి అభ్యర్ధించింది.


ఇక ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ శుక్రవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. ఇవాళ పలు రాష్ట్రాల్లో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. మరోవైపు,కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు చేస్తోంది.