భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్..నాలుగు లక్షల కోళ్లు మృతి..కాకులు, నెమళ్లు కూడా

భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్..నాలుగు లక్షల కోళ్లు మృతి..కాకులు, నెమళ్లు కూడా

Bird Flu Danger Bells : భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. దీంతో వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న బర్డ్ వైరస్ మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బయటపడింది. ఈ వైరస్ క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే పెద్ద భారీ సంఖ్యలో కోళ్లు, కాకులు, బాతులు, నెమళ్లుకూడా ఈ వైరస్ కు గురై మృత్యువాతపడుతున్నాయి.

హర్యానాలో గత పది రోజుల్లో 4 లక్షలకు పైగా పౌల్ట్రీ కోళ్లు చనిపోపోవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఒక్క పంచకుల జిల్లాలోనే నాలుగు లక్షలకు పైగా కోళ్లు మరణించటంతో పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.దీంతో అధికారులు కొన్ని కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి జలంధర్ రీజినల్ డిసీస్ డయాగ్నసిస్ ల్యాబ్‌కు పంపించారు. కానీ ఇప్పటి వరకూ..ఏవియన్ ఇన్‌ఫ్లూయెండా బయటపడలేదు. కానీ..ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లలో ఏవియన్ ఇన్‌ఫ్లూయేంజా కేసులు బయటపడ్డాయి. మంగళవారం జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్‌లో కూడా కొన్ని బయటపడ్డాయి.

బర్డ్ ఫ్లూ కేసులు బయటపడుతున్న క్రమంలో అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఏమాత్రం ఆలస్యం చేయవద్దని సూచించింది. వెంటనే చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావారణమార్పుల శాఖ అడ్వైజరీ జారీచేసింది.

ఎక్కడైనా పక్షులు చనిపోతే దానికి సంబంధించిన వివరాలను వెంటనే కేంద్రానికి అందజేయాలని సూచనలు జారీ చేసింది. ఇది విదేశీ పక్షలు వలస వచ్చే సీజన్‌ కాబట్టి మరింత జాగ్రత్తగా చర్యలు చేపట్టాలని సూచించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ప్యాండ్ డ్యామ్ చట్టుపక్కల పెద్ద మొత్తంలో బాతులు మరణించాయి. మధ్యప్రదేశ్ లోని మందసైర్ ప్రాంతంలో 24గంటల్లో 100 కాకులు మరణించాయి. వైరస్‌తోనే అవి మృతిచెందినట్లు పరీక్షల్లో తేలింది.

దీంతో అప్రమత్తమైన కంగ్రా జిల్లా యంత్రాంగం.. ఫతేపూర్, దెహ్రా, జవాలి, ఇందోరా ప్రాంతాల్లో చికెన్, గుడ్లు, చేపల అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధించారు. ఈ ప్రాంతాల్లో కోళ్ల ఎగుమతి, దిగుమతులను నిలిపివేశారు. పాంగ్ డ్యామ్ చుట్టుపక్కల కఠిన ఆంక్షలు విధించింది. పాంగ్ డ్యామ్ చుట్టు పక్కల కి.మీ. పరిధిలోని ప్రాంతాన్ని అలర్ట్ జోన్‌గా ప్రకటించింది.

ఈ వైరస్ ప్రభావంతో మధ్యప్రదేశ్‌లోని మాంద్‌సౌర్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో చికెన్,గుడ్లు అమ్మకాలపై నిషేధం విధించారు. ఆయా ప్రాంతాలకు కోళ్ల సరఫరాను నిలిపివేశారు. కేరళలోనూ 1700 బాంతులు ఈ వైరస్ కారణంగా మరణిస్తున్నాయి. అలప్పుళ, కొట్టాయంలో ముందుజాగ్రత్తగా వేలాది బాతులను చంపి పూడ్చిపెట్టారు.

ఈ క్రమంలో సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు కేరళ నుంచి కోళ్ల సరఫరాను తమిళనాడు నిలిపివేసింది. వచ్చిన వాహనాలకు వచ్చినట్లుగా వెనక్కి పంపించేస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కాకులు పెద్ద ఎత్తున మరణిస్తున్నాయి. ఈ క్రమంలో మిగతా రాష్ట్రాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా సంక్రమిస్తుందని.. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.