ప్రైవేట్ సెక్టార్‌లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే, జగన్ బాటలో బీజేపీ సీఎం

  • Published By: naveen ,Published On : July 7, 2020 / 09:01 AM IST
ప్రైవేట్ సెక్టార్‌లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే, జగన్ బాటలో బీజేపీ సీఎం

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగాల విషయంలో స్థానికతకు పెద్ద పీట వేసింది. ప్రైవేట్ సంస్థల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ముసాయిదా ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా తెలిపారు. తదుపరి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ లో ఈ డ్రాఫ్ట్ ని ఉంచనున్నారు.

 

దేశంలో ఏపీ తర్వాత హర్యానానే:
కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల హర్యానాలోని పరిశ్రమలపై బాగా ప్రభావం చూపింది. ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 70 నుంచి 80 శాతం కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. మరోవైపు పరిశ్రమలను పునరుద్ధరించిన తర్వాత హర్యానాలో కార్మికుల కొరత బాగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ సంస్థల్లో 75శాతం ఉద్యోగాలను స్థానికులతో భర్తీ చేసేందుకు ఒక ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల అభ్యర్థులు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాల కోసం హర్యానాకు తరలి రావడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. హర్యానాలో బీజేపీతో కలిసి అధికారంలో ఉన్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఎన్నికలప్పుడు స్థానిక యువతకు ఇచ్చిన హామీ ఈ మేరకు నేరవేరింది. కాగా, దేశంలో ఇలాంటి ఆర్డినెన్స్ జారీ చేసిన రెండో రాష్ట్రంగా హర్యానా నిలిచింది. 2019 ఏడాది జూలైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి ఉత్తర్వులను జారీ చేసింది.

శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం మస్ట్:
ఉద్యోగం పొందాలంటే అభ్యర్థులకు శాశ్వత నివాస (డొమిసిల్‌) ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. రూ.50 వేలలోపు వేతనం వచ్చే ఉద్యోగాలకు రిజర్వేషన్‌ వర్తిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగులు, కంపెనీల యాజమాన్యాలు ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేసుకోవడం తప్పనిసరి. అయితే ఒకవేళ ఆ జాబ్ కి అవసరమైన స్కిల్ స్థానిక అభ్యర్థిలో లేకుంటే వారి స్థానంలో ఇతర రాష్ట్రాల వారిని తీసుకునే వెసులుబాటుని ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలకు ప్రభుత్వం కల్పించింది. ఇకపై ప్రైవేట్ సెక్టార్ లో 75శాతం ఉద్యోగాలు స్థానికులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ లో పెద్ద సంఖ్యలో ఎంఎన్సీలు, కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. ఆయా కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ విషయంలో స్థానికులకు ముందుగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

 

నెరవేరిన దుష్యంత్ ఎన్నికల హామీ:
హర్యానాలో మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ సర్కారు అధికారంలో ఉంది. జననాయక్‌ జనతా పార్టీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. ప్రైవేట్ సెక్టార్ లో 75శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే అని ఎన్నికల సమయంలో డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా హామీ ఇచ్చారు. మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ సర్కారు ఇప్పుడు దానికి ఆమోద ముద్ర వేసింది. ఈ ముసాయిదాపై దుష్యంత్ చౌతాలా స్పందించారు. ఇదొక చారిత్రక దినం అన్నారు. ఇకపై ప్రైవేట్ సెక్టార్ లోని కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలు కచ్చితంగా రాష్ట్రానికి చెందిన స్థానిక యువతకే ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

Read Here >>హార్వర్డ్ లో ఫెయిల్యూర్స్ కేస్ స్టడీగా భారత్ కరోనా పోరాటం