హర్యానాలో కమలమే.. స్వతంత్రుల సపోర్ట్ బీజేపీకే!

  • Published By: vamsi ,Published On : October 25, 2019 / 07:30 AM IST
హర్యానాలో కమలమే.. స్వతంత్రుల సపోర్ట్ బీజేపీకే!

హర్యానాలో సంపూర్ణ ఆధిక్యం సాధిస్తామన్న కమలనాథుల ఆశలకు గండిపడింది. హర్యానాలో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం అనివార్యంగా మారింది. అనూహ్యంగా విపక్షాలు బలం పెంచుకోవడంతో ఆసక్తికరంగా సాగిన ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది.

90 స్థానాలకు గాను 40 చోట్ల నెగ్గి బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 31 స్థానాలతో కాంగ్రెస్‌ రెండోస్థానంలో నిలవగా.. ప్రాంతీయ పార్టీల్లో జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ) 10 చోట్ల నెగ్గింది. మిగిలిన 9 స్థానాల్లో ఇతర పార్టీలు, స్వతంత్రులు గెలుపొందారు.

అయితే ఈ 19 స్థానాలే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నాయి. ఈ క్రమంలోనే గెలిచీ గెలవడంతోనే బీజేపీ అధిష్ఠానంతో భేటీ అయ్యేందుకు ఇద్దరు స్వతంత్రులు ప్రత్యేక విమానంలో ఢిల్లీలో వాలిపోయారు. నలభై చోట్ల నెగ్గి అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది.

ఈ విషయమై ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటి అయ్యారు. మరోవైపు తమ మద్దతు బీజేపీకే అంటూ మరికొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రకటించారు.

దీంతో  ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు అవసరం అవగా.. స్వతంత్రులతో కలుపుకుని బీజేపీకి అవసరం అయిన సీట్లు లభించినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో బీజేపీ ప్రభుత్వమే హర్యానాలో మళ్లీ ఏర్పాటు కాబోతుంది.