హ‌త్రాస్‌ కేసు : గ్రామ పెద్ద సంచలన వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : October 7, 2020 / 08:45 PM IST
హ‌త్రాస్‌ కేసు : గ్రామ పెద్ద సంచలన వ్యాఖ్యలు

Hathras case : attacked by family, says village head  దేశవ్యాప్తంగా కలకలం రేపిన హ‌త్రాస్‌ గ్యాంగ్ రేప్ ఘటనపై గ్రామ పెద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో బాధితురాలికి నిందితుడితో సంబంధం ఉందని, దీన్ని బాధితురాలి కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసిందని ఆయన ఆరోపించారు. బాలికను కలిసేందుకు నిందితుడు రాగా పట్టరాని కోపంతో కుటుంబ సభ్యులు ఆమెపై దాడిచేశారని ఆరోపించారు.



బాధితురాలు, ప్రధాన నిందితుడు చాలా కాలంగా ఫోన్‌లో సంప్రదింపులు జరిపారని, వారి సన్నిహిత సంబంధం పట్ల బాధితురాలి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపాడు. నిందితుడే బాలికకు సెల్‌ ఫోన్‌ ఇచ్చాడని, కుటుంబ సభ్యులే బాధితురాలిపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయని ఆరోపించారు. హిందూ మతంలో అలాంటి హేయమైన నేరానికి (సామూహిక లైంగికదాడి) ఎవరూ పాల్పడరని అన్నారు.


నిందితులంతా నార్కో పరీక్షకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఇతరుల నేరానికి మరో వ్యక్తిని శిక్షించరాదని అన్నారు. ఈ కేసు నేపథ్యంలో రాజకీయ పార్టీల కార్యకర్తలు బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామనే పేరుతో గ్రామంలో ఉన్నారని, ఇది గ్రామంలో శాంతిభద్రతలకు ముప్పుగా పరిణమిస్తుందని గ్రామ పెద్ద హ‌త్రాస్‌ ఎస్డీఎంకు లేఖ రాశారు.

కాగా, బాధితురాలు కుటుంబం, నిందితుడి మధ్య పలుమార్లు ఫోన్‌ సంభాషణలు జరిగాయని, ఈ కేసులో బాలిక సోదరుడిని పోలీసులు ప్రశ్నించాలని బీజేపీ నేత అమిత్‌ మాలవీయ డిమాండ్‌ చేశారు.


ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్‌ లో సెప్టెంబర్‌ 14న 20 ఏళ్ళ యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. పొలంలో పనిచేసుకుంటున్న బాధితురాలిని లాక్కెళ్లి చిత్ర హింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుక కోసి, వెన్నెముక విరిగేలా రాక్షసంగా వ్యవహరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెకు తొలుత అలీఘర్‌లో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో, ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. పక్షవాతంతో పాటు శరీరంలోని కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలు చిత్రవధ అనుభవించిన బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ సెప్టెంబర్‌ 29న సఫ్దర్ జంగ్ హాస్పిటల్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.