హ‌త్రాస్‌ ఘోరంపై సీజేఐకి 47మంది మహిళా లాయర్ల లేఖ

  • Published By: venkaiahnaidu ,Published On : October 1, 2020 / 07:50 PM IST
హ‌త్రాస్‌ ఘోరంపై సీజేఐకి 47మంది మహిళా లాయర్ల లేఖ

47 woman advocates write to CJI దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ​ హ‌త్రాస్‌ గ్యాంగ్ రేప్ ఘటనపై.47 మంది మహిళా న్యాయవాదులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని జస్టిస్​ ఎస్​ఏ బోబ్డేను, కొలీజియం న్యాయమూర్తులను కోరారు.

ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేయాలని ప్రయత్నించిన పోలీసులు, పాలనాధికారులు, వైద్య సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీజేఐని కోరారు. అర్ధరాత్రి దహన సంస్కారాలు చేయడం బాధితురాలి కుటుంబానికి, వారి మత విశ్వాసాలకు విరుద్ధం. ముఖ్యంగా ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు పరిగణనలోకి తీసుకొని తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబం… వ్యవస్థపై విశ్వాసాన్ని కోల్పోకుండా తగిన చర్యలు తీసుకొని, వారికి భరోసా ఇవ్వాలని మహిళా న్యాయవాదులు. విజ్ఞప్తి చేశారు.


కాగా, రెండు వారాల క్రితం యూపీలోని హత్రాస్‌ లో 19 ఏళ్ళ యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. పొలంలో పనిచేసుకుంటున్న బాధితురాలిని లాక్కెళ్లి చిత్ర హింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుక కోసి, వెన్నెముక విరిగేలా రాక్షసంగా వ్యవహరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెకు తొలుత అలీఘర్‌లో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో, ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. పక్షవాతంతో పాటు శరీరంలోని కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలుగా చిత్రవధ అనుభవించిన బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ మంగళవారం సఫ్దర్ జంగ్ హాస్పిటల్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.



మరోవైపు, ఈ ఘ‌ట‌న‌పై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెలువెత్తాయి. పోలీసులు అర్థరాత్రి వేళ ఆ యువతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం వివాదానికి దారి తీసింది. తమను ఇంట్లో నిర్బంధించి బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే యువతి తండ్రి, సోదరుడి అనుమతితోనే రాత్రివేళ అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.