హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసు….యోగి రాజీనామా చేయాలనీ ప్రియాంక డిమాండ్

  • Published By: venkaiahnaidu ,Published On : September 30, 2020 / 07:23 PM IST
హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసు….యోగి రాజీనామా చేయాలనీ ప్రియాంక డిమాండ్

Hathras gangrape case ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ ‌లో దళిత యువతి హత్యాచార ఘటనకు సంబంధించి యోగి ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ప్రియాంక గాంధీ డిమాండ్‌ చేసింది.


.

హత్యాచార ఘటనపై తాను బాధితురాలి తండ్రితో మాట్లాడానని ప్రియాంక చెప్పారు. తన కుమార్తె భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకువెళ్లి అంత్యక్రియలు జరిపే అవకాశాన్నీ తనకు ఇవ్వలేదని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. బాధితురాలు, ఆమె కుటుంబాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం చివరికి మరణంలోనూ వారి మానవ హక్కులను కాలరాశారని ప్రియాంక యూపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కును యోగి ఆదిత్యానాథ్‌ కోల్పోయారని ప్రియాంక ట్వీట్ చేశారు.


కాగా, ఈనెల 19న యూపీలోని హత్రాస్‌లో పశుగ్రాసం కోసం తల్లితో కలిసి పొలానికి వెళ్లిన యువతిపై దుండగులు లైంగిక దాడికి పాల్పడటంతో పాటు ఆమెను తీవ్రంగా గాయపరిచారు. రెండు వారాల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన బాధితురాలు మంగళవారం రాత్రి మరణించిన విషయం తెలిసిందే. మరోవైపు సామూహిక అత్యాచార ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచిన యువతి భౌతిక కాయాన్ని పోలీసులు హడావిడిగా దహనం చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇక, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వరుస ట్వీట‍్లలో యూపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దళితులను అణిచివేస్తూ సమాజంలో వారి స్ధానం ఏంటో యూపీ ప్రభుత్వం చూపుతోందని, ఇది సిగ్గుచేటని రాహుల్‌ అన్నారు. .