Suvendu Adhikari : మమత మేనల్లుడి ఫోన్ కాల్ రికార్డులు ఉన్నాయ్..ఫోన్ ట్యాపింగ్ వివాద సమయంలో సువెందు సంచలన వ్యాఖ్యలు

ఇజ్రాయెల్ కి చెందిన పెగాసస్ స్పైవేర్ ద్వారా కేంద్రమంత్రులు,విపక్ష నేతలు,జడ్జిలు,జర్నలిస్టులు సహా పలువురు ప్రముఖుల ఫోన్లు హాక్యింగ్ కు గురయ్యాయనే అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.

Suvendu Adhikari : మమత మేనల్లుడి ఫోన్ కాల్ రికార్డులు ఉన్నాయ్..ఫోన్ ట్యాపింగ్ వివాద సమయంలో సువెందు సంచలన వ్యాఖ్యలు

Suvendu

Suvendu Adhikari ఇజ్రాయెల్ కి చెందిన పెగాసస్ స్పైవేర్ ద్వారా కేంద్రమంత్రులు,విపక్ష నేతలు,జడ్జిలు,జర్నలిస్టులు సహా పలువురు ప్రముఖుల ఫోన్లు హాక్యింగ్ కు గురయ్యాయనే అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సైతం ఇదే అంశం కుదిపేస్తుంది. ఈ ఫోన్ హ్యాకింగ్ లో కేంద్రప్రభుత్వం పాత్ర ఉందంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్న వేళ..బెంగాల్ బీజేపీ నేత సువెందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా సువెందు అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

సోమవారం ఓ బహిరంగ సభలో బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి సువెందు మాట్లాడుతూ.. ఈస్ట్ మిడ్నాపూర్ ఎస్పీ కే అమ‌ర్‌నాథ్ కాల్ రికార్డుల‌న్నీ త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని అన్నారు. మమత మేన‌ల్లుడి (టీఎంసీ ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ) ఆఫీస్ నుంచి ఎవ‌రెవ‌రు ఎస్పీకి కాల్ చేస్తున్నారో అన్ని రికార్డులు తమ ద‌గ్గ‌ర ఉన్నాయన్నారు. ఎస్పీని ఉద్దేశించి మాట్లాడుతూ.. నీకు రాష్ట్ర ప్ర‌భుత్వం అండ‌గా ఉంటే మాకు కేంద్ర ప్ర‌భుత్వం అండ‌గా ఉంది అని సువేందు అన‌డం గ‌మ‌నార్హం. జాగ్ర‌త్త‌గా ఉండాలని ఎస్పీకి సువెందు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అమ‌ర్‌నాథ్ అనే ఓ యువకుడు ఇక్క‌డికి ఎస్పీగా వ‌చ్చాడు. అత‌నేంటో నాకు తెలుసు. అత‌నికి ఒక్క‌టే చెప్ప‌ద‌ల‌చుకున్నా. నువ్వో సెంట్ర‌ల్ కేడ‌ర్ అధికారివి. నిన్ను క‌శ్మీర్‌లోని అనంత్‌నాగ్ లేదా బారాముల్లాకు ట్రాన్స్‌ఫ‌ర్ చేసేలా ఏ ప‌నీ చేయొద్ద‌ని చెబుతున్నా అని సువేందు అన్నారు. సీబీఐ తర్వలోనే ఐఓలు,ఐసీలు,ఓసీల పాత్రపై దర్యాప్తు చేస్తుందని.. మమతా బెనర్జీని ఆంటీగా సంబోధిస్తూ..ఏ ఆంటీ నిన్ను కాపాడలేదు అని ఎస్పీని ఉద్దేశించి సువెందు అధికారి అన్నారు.

కాగా, సువేందుపై ఉన్న ఆరోప‌ణ‌ల‌పై మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించిన స‌మ‌యంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. 2018లో ఆయ‌న సెక్యూరిటీ గార్డ్ హ‌త్య‌పై సీఐడీ, ఓ దొంగ‌త‌నం కేసులో పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

మరోవైపు, ఎస్పీ ఫోన్ కాల్ రికార్డింగ్ లు తమ వద్ద ఉన్నాయంటూ సువెందు అధికారి చేసిన వ్యాఖ్యలపై ఈస్ట్ మిడ్నాపూర్ పోలీసులు ఆయనపై మూడు సుమోటో కేసులు నమోదు చేశారు. ప్రభుత్వాధికారులను.. బెదిరించడం,అవమానించడం,వారి ఫోన్లను ట్యాపింగ్ చేయడం వంటి ఆరోపణలపై సువెందుపై కేసులు నమోదు చేశారు. అఫిషీయల్ సీక్రెసీ చట్టం కూడా సువెందు పై కేసు నమోదైంది.