మీరెప్పుడైనా అనకొండ రైలును చూశారా?

10TV Telugu News

భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం. దేశంలోనే తొలిసారిగా మూడు గూడ్స్ రైళ్లను జత చేసి ఒకే రైలుగా విజయవంతంగా నడిపించి రికార్డు సృష్టించింది. బిలాస్ పూర్ డివిజన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కు చెందిన మూడు గూడ్స్ రైళ్లను జత చేసి నడిపి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం లోడుతో ఉన్న మూడు రైళ్లను జత కలిపి బిలాస్ పూర్-చక్రధర్ పూర్ డివిజన్ల మధ్య విజయవంతంగా నడిపినట్లు పేర్కొంది.

15 వేల టన్నులకు పైగా సరకుతో ఉన్న మూడు రైళ్లను అనకొండను పోలినట్లుగా నడిపించినట్లు తెలిపింది. గూడ్స్ రైలు సర్వీసుల రవాణా సమయాన్ని తగ్గించేందుకే ఈ వినూత్న ప్రయోగం చేపట్టినట్లు తెలిపింది. ఇటీవల రైల్వే మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ కరోనా సంక్షోభ సమయంలో ఆహార ధాన్యాలు, ఎరువులు, బొగ్గుతోపాటు ఇతర నిత్యవసర సామాగ్రిని తరలించడంపై రైల్వే శాఖ దృష్టి పెట్టిందని చెప్పారు.

శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా వలసకూలీలను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లు తెలిపారు. రైల్వే శాఖ దేశంలో ప్యాసింజర్ రైళ్ల కదలికను పరిమితం చేసినప్పటికీ గూడ్స్ రైలు సేవలు యథాతథంగా నడుస్తున్నాయని వెల్లడించారు.