అడిగితే కాదంటానా : సోనియా కోరిక నెరవేర్చుతున్న దేవెగౌడ

  • Published By: venkaiahnaidu ,Published On : June 8, 2020 / 09:51 AM IST
అడిగితే కాదంటానా : సోనియా కోరిక నెరవేర్చుతున్న దేవెగౌడ

జేడీఎస్ వ్యవస్థాపకుడు,మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవెగౌడ(87) రాజ్యసభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు,కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ,ఇతర జాతీయ నాయకుల అభ్యర్థన మేరకు దేవెగౌడ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు. మంగళవారం దేవెగౌడ నామినేషన్‌ను దాఖలు చేయనున్నట్ల కుమారస్వామి తెలిపారు. దేవెగౌడ కు మధ్దతు ఇచ్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ అంగీకరించింది.

కర్నాటక నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నెల 19 న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి అధికార బీజేపీ ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టింది. మూడో అభ్యర్థిని నిలబెట్టే విషయంలో బీజేపీలో చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తనకున్న 68ఎమ్మెల్యేలతో ఒక్క రాజ్యసభ సీటును గెల్చుకునేందుకు ఎలాంటి ఇబ్బందిలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ… సీనియర్ లీడర్ మల్లిఖార్జున ఖర్గేను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మొదటిసారిగా రాజ్యసభలోకి అడుగుపెడుతున్నారు మల్లిఖార్జున ఖర్గే. అయితే మరో రాజ్యసభ అభ్యర్థికి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ దగ్గర అదనపు ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ అదనపు ఓట్లతో దేవెగౌడ గెలవనున్నారు.

కర్ణాటకలో జేడీఎస్‌కు ప్రస్తుతం 38 ఎమ్మెల్యే స్థానాలే ఉన్నాయి. దేవెగౌడ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే మరో 16 స్థానాలు అవసరం. అయితే.. కాంగ్రెస్‌కు కర్ణాటకలో 68 స్థానాల బలం ఉన్న నేపథ్యంలో మిగులు ఓట్లను జేడీఎస్‌కు సర్దుబాటు చేసి దేవెగౌడ ఎన్నికకు మార్గం సుగమం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజ్యసభ ద్వారా పార్లమెంటులోకి రావడానికి దేవెగౌడ సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే, పార్టీ ఎమ్మెల్యేల జోక్యం, సోనియా మాటతో ఆయన రాజ్యసభలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు.

మొత్తం 16 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన దేవెగౌడ.. ఏడుసార్లు అసెంబ్లీకి, 6 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మూడు సార్లు మాత్రమే ఓడిపోయారు. దేవెగౌడ రాజ్యసభలో అడుగుపెట్టడం ఇది రెండోసారి. 1996-1998వరకు దెవెగౌడ రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేవెగౌడ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. దేవెగౌడ గెలిస్తే పెద్దల సభకు వెళ్తున్న రెండో మాజీ ప్రధాని అవుతారాయన. ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పెద్దల సభలోనే ఉన్న విషయం తెలిసిందే.

Read:  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అస్వస్ధత