బైకర్‌ను ఆపిన పోలీస్.. ఎందుకో తెలిస్తే చేతులెత్తి నమస్కరించాల్సిందే

తమిళనాడులో జరిగిన ఓ ఘటన.. అందరి హృదయాలను టచ్ చేస్తోంది. ఓ పోలీస్ చేసిన పని.. మానవత్వాన్ని చాటింది.

బైకర్‌ను ఆపిన పోలీస్.. ఎందుకో తెలిస్తే చేతులెత్తి నమస్కరించాల్సిందే

Heart Touching Video

heart touching video : తమిళనాడులో జరిగిన ఓ ఘటన.. అందరి హృదయాలను టచ్ చేస్తోంది. ఓ పోలీస్ చేసిన పని.. మానవత్వాన్ని చాటింది. ఆయనకు.. అందరితో చేతులెత్తి దండం పెట్టిస్తోంది. అసలేం జరిగిందంటే..

కొద్దిరోజుల క్రితం కర్ణాటకకు చెందిన అరుణ్‌ అనే ట్రావెల్‌ యూట్యూబర్‌ పాండిచ్చేరి నుంచి తెన్‌కాశీకి బయలుదేరి వెళుతున్నాడు. ఆ సమయంలో రోడ్డుపక్కన ఓ పోలీస్ కనిపించాడు. అతడు.. అరుణ్ ని ఆపాడు. పోలీస్ తనను సడెన్ గా ఆపేయడంతో అరుణ్ కొంత కంగారుపడ్డాడు. అతడు ఏం అడుగుతాడోనని ఆలోచన చేశాడు. లైసెన్స్ అడుగుతాడా? లేక డబ్బు డిమాండ్ చేస్తాడా? అని కంగారుపడ్డాడు. కానీ అతడి ఆలోచనలకు భిన్నంగా జరిగింది.

అరుణ్ ని ఆపిన పోలీస్ అతడితో మాట్లాడాడు. అతడి చేతికి ఓ మందు సీసా ఇచ్చాడు. సరిగ్గా అదే సమయలో అటుగా ఆర్టీసీ బస్సు వెళ్తోంది. ఆ బస్సుని అరుణ్ కి చూపించిన పోలీసు.. ఇలాంటి బస్‌ ఒకటి ముందు వెళుతోంది. అందులో ఓ అమ్మ మందు మరిచిపోయి పోయింది. ఆమెకు ఈ మందు ఇవ్వు అంటూ మెడిసిన్ బాటిల్ ని అరుణ్ చేతిలో పెట్టాడు. ఆ బాటిల్ ని తీసుకున్న అరుణ్ వేగంగా బైక్ ని పోనిచ్చాడు.

పోలీస్ చెప్పిన బస్సు దగ్గరికి చేరుకున్నాడు. బస్సు ఆపమని డ్రైవర్‌ తో సైగలు చేస్తూ చెప్పాడు. దీంతో డ్రైవర్ బస్సుని ఆపాడు. బస్సు దగ్గరికి వచ్చిన అరుణ్.. తన చేతిలో మెడిసిన్ బాటిల్ తీసి బస్సులో ఉన్న పెద్దావిడకు ఇచ్చాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు పోలీస్ ని, బైకర్ ని ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘మీ ఇద్దరు మానవత్వానికి న్యాయం చేశారు’ అని ఒకరంటే, ‘ఇదో మనసు మెప్పించే వీడియో’ అని మరొకరు కామెంట్ చేశారు. ‘ నిజంగా ఆ పోలీసుకు చేతులెత్తి దండం పెట్టాలి’ అని ఇంకొకరు కామెంట్ చేశారు. హ్యాట్సాఫ్ సార్ అని మరికొందరు ఆ పోలీస్ కు సెల్యూట్ చెప్పారు.